భారీ అంచనాల నడుమ పవన్ కళ్యాణ్ చేసిన కొమురం పులి, తీన్మార్, పంజా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. హ్యాట్రిక్ ప్లాప్స్ దక్కించుకున్న పవన్ తదుపరి చిత్రం ఎలా ఉండాలా అని ఎదురు చూస్తున్న సమయంలో కొందరు సల్మాన్ ఖాన్ దబాంగ్ చిత్రం రీమేక్ ను ఆయన వద్దకు తీసుకు వెళ్లారు. దబాంగ్ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో పాటు ఆ స్టోరీ పవన్ కళ్యాణ్ కు నచ్చడంతో రీమేక్‌కు పవన్ సిద్దం అయ్యాడు.దర్శకుడు హరీష్ శంకర్ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించాడు. తనను అమితంగా ఆరాధించే బండ్ల గణేష్‌కు ఈ సినిమా నిర్మాణ బాధ్యతను పవన్ అప్పగించాడు.
ఈ చిత్రంలో హీరోయిన్‌గా శృతి హాసన్ నటించింది. అప్పటి వరకు ఈమె నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యాయి. దాంతో ప్లాప్ టాగ్ ఉన్న హీరోయిన్ ని పవన్ కళ్యాణ్ కోసం తీసుకోవడం ఏంటనే విమర్శలు వచ్చాయి.
బాలీవుడ్ హాట్ ఐటెం బాంబ్ మలైకా అరోరాతో ఈ చిత్రంలో కెవ్వు కేక ఐటెం సాంగ్‌ను చేయించడం పెద్ద సంచలనంగా చెప్పుకోవచ్చు. ఆ పాట సినిమా విడుదలకు ముందే పెద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా పెద్దగా అంచనాలు లేకుండానే షూటింగ్‌కు వెళ్లినా విడుదలకు ముందు పాటలు మరియు ఇతరత్ర ప్రమోషన్ కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇలా పలు విమర్శలతో, టీజర్, ట్రైలర్ నింపిన ఆశలతో.. సినిమా రిలీజ్ డే వచ్చింది.. షో మొదలైంది.. సీన్ సీన్ కి అభిమానుల ఆనందం రెట్టింపవుతుంది. సినిమా అయ్యేటప్పటికీ అందరి నోటా ఒకే మాట బ్లాక్ బస్టర్ కా బాప్ ఆగాయా.. ఇక ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ సర్దేస్తది. అప్పుడర్థమైంది విమర్శించిన అందరికీ కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు.. ఎన్ని ప్లాప్స్ వచ్చినా పవన్ కళ్యాణ్ ఇమేజ్ అండ్ బాక్స్ ఆఫీస్ బోనాంజాని ఏమీ చేయలేవని..
సమ్మర్ హాలీడేస్‌ను పూర్తిగా వినియోగించుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. అప్పటి వరకు ఉన్న పలు రికార్డులను కూడా ఈ చిత్రం బ్రేక్ చేసి టాప్ చిత్రాల జాబితాలో చేరింది. 306 థియేటర్లలో ఈ చిత్రం 50 రోజులు ఆడి సంచలనం సృష్టించింది. 81 ఏళ్ల సినీ చరిత్రలో సాధ్యం కాని రికార్డును గబ్బర్ సింగ్ దక్కించుకుంది. 250 సెంటర్స్‌లో డైరెక్ట్‌గా 50 డేస్‌ను పూర్తి చేసుకోవడం కూడా ఒక రికార్డు.
వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఈ సినిమాతో ఓవర్సీస్‌లో పవన్ కింగ్ అయ్యి కూర్చున్నాడు. ఓవర్సీస్‌లో అప్పటి వరకు దూకుడు(1.6 మిలియన్ డాలర్లు) పేరుతో ఉన్న రికార్డును 1.79 మిలియన్ డాలర్లతో బ్రేక్ చేసిన గబ్బర్ సింగ్ సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది. మొదటి వారం రోజుల్లో 60 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు, 42.55 కోట్ల షేర్‌ను రాబట్టిన మొదటి తెలుగు సినిమాగా రికార్డు సాధించింది. అప్పటి వరకు ఉన్న ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌లో ఆల్ టైం రికార్డుగా నిలిచింది. 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం దాదాపుగా 150 కోట్లు(గ్రాస్) వసూళ్లు చేసింది.
సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన ఎలిమెంట్స్ పవన్ బాడీ లాంగ్వేజ్, సంగీతం, అంత్యాక్షరి ఎపిసోడ్. మాస్ ఆడియన్స్ మళ్లీ మళ్లీ థియేటర్లుకు వచ్చేలా ఈ మూడు చేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా అంత్యాక్షరి ఎపిసోడ్ ఒక సంచలనం. సినిమా స్థాయిని రెట్టింపు చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రౌడీలతో అంత్యాక్షరి ఎపిసోడ్‌తోనే సినిమాను లేపాశారనే కామెంట్స్ కూడా వచ్చాయి.
ఈ చిత్రంలో శృతి హాసన్‌ను చూపించిన తీరు కూడా చాలా ప్రత్యేకం. సినిమా మొత్తంలో ఎక్కడ కూడా మోడ్రన్ డ్రస్‌ల్లో చూపించలేదు. కనీసం పాటల్లో కూడా ఆమెను హాట్‌గా చూపించే ప్రయత్నం చేయలేదు. ఈ చిత్రంతో శృతి హాసన్ కెరీర్ టర్న్ అయ్యింది. గబ్బర్ సింగ్‌తో మొదటి సక్సెస్ దక్కించుకున్న శృతి టాప్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. ఇక పవన్ గబ్బర్ సింగ్ తర్వాత మళ్లీ వెనక్కు తిరిగి చూసుకోలేదు.
స్పెషల్ గా చెప్పుకోవాల్సింది.. డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి.. పవన్ కళ్యాణ్ ని డీల్ చేయగలడా అన్న అందరి నోళ్లు మూయించాడు. మాట్నీ షో టైంకి అందరికీ హాట్ పేవరైట్ కమర్షియల్ డైరెక్టర్ అయిపోయాడు. ఒక అభిమానిగా హీరోతో సినిమా చేస్తే ఇంత వండర్ఫుల్ గా ఉంటుందా అని ప్రూవ్ చేశారు. ఆయన రాసిన పవర్ఫుల్ క్యారెక్టర్, డైలాగ్స్, వేయించిన డాన్సులు, మాస్ ఆడియన్స్ పిచ్చెక్కిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎలివేషన్స్ మళ్ళీ ఎవరూ చూపించలేకపోయారు అనడంలో అతిశయోక్తి లేదు.
ఈ సినిమాతో వచ్చిన డబ్బులతో నిర్మాత బండ్ల గణేష్ ఒక్కసారిగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయ్యాడు. పెద్ద పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేశాడు. హీరో, హీరోయిన్, నిర్మాత, దర్శకుడు పలువురు నటీనటులకు ఈ చిత్రం కెరీర్‌లో కీలకంగా నిలిచింది.
అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా కెవ్వు కేక అనిపించే గబ్బర్ సింగ్ విడుదల అయ్యి 8 ఏళ్లు అవుతుంది. మరో 8 ఏళ్లు అయినా కూడా గబ్బర్ సింగ్‌కు అదే క్రేజ్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.