‘కరోనా వైరస్‌ని అరికట్టడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోంది..’ అంటూ ఓ పక్క ప్రభుత్వం తరఫున మంత్రులు ప్రకటిస్తోంటే, ఇంకోపక్క ‘కరోనా వైరస్‌తో కలిసి సహజీవనం సాగించాల్సిందే..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చెబుతున్నారు. ఏది నిజం.? ఎవరి మాటను వినాలి.? కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వాలు ఫెయిల్ అయినట్లు ఒప్పుకుంటే, కరోనా వైరస్‌తో సహజీవనం చేయాల్సిందేనన్న పాలకుల మాటల్ని ప్రజలు సమర్థిస్తారేమో.
ఓ పక్క కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయంటూనే, సహజీవనం చేయమనడమేంటి.? కరోనా విషయంలోనే కాదు, ‘స్టైరీన్’ విషవాయువు విషయంలోనూ ప్రభుత్వం తీరు ఇలాగే కన్పిస్తోంది. మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేశాం.. తీవ్ర అస్వస్థతకు గురైనవారికి వైద్య చికిత్స అందిస్తున్నాం.. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ప్యాకేజీ ప్రకటించేశాం.. ఆల్ హ్యాపీస్.. అని ప్రభుత్వం ప్రకటించేసుకుంది. గ్రామాల్లో శానిటేషన్ కూడా పూర్తయ్యింది గనుక.. ప్రజలెవరూ ఆందోళన చెందక్కర్లేదన్నది ప్రభుత్వ వాదన.
కానీ, గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితులు వేరేలా వున్నాయి. రోజులు గడుస్తున్నా, ఎల్జీ పాలిమర్స్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఇంకా భయం భయంగానే బతుకులీడుస్తున్నారు. కొందరైతే, తమ ఇళ్ళకు వెళ్ళేందుకూ సుముఖత వ్యక్తం చేయడంలేదు. వెళ్ళినవారిని రకరకాల భయాలు వెంటాడుతున్నాయి. ఇంట్లో సామాన్లన్నింటినీ బయటపడేసి శుభ్రం చేసుకోవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు కదా. నానా తంటాలూ పడి వాటన్నిటినీ శుభ్రం చేసినా, మళ్ళీ ఎక్కడో ఏదో ఒక మూల నుంచి ‘స్టైరీన్’ తాలూకు వాసన వస్తోందంటూ బాధిత ప్రజానీకం వాపోతున్నారు.
కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న దరిమిలా తమ పరిస్థితి మరింత దయనీయంగా వుందన్నది ప్రజల వాదన. ఈ విషయాలన్నిటినీ ప్రస్తావిస్తూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘కరోనాతో సహజీవనం చేయమన్నారు.. స్టైరీన్‌తోనూ సహజీవనం చేయాలా.?’ అని ప్రశ్నించారు ప్రభుత్వాన్ని. ఇంకేముంది.? ‘కుల మీడియా’ గుస్సా అయ్యింది. ‘ఎప్పుడూ సహజీవనం గురించిన ఆలోచనలే..’ అంటూ పవన్‌పై విరుచుకుపడ్డం మొదలెట్టింది. అధికార పార్టీ నేతలూ వంత పాడుతున్నారు.
నిజానికి, ‘సహజీవనం’ అనే మాటకి పేటెంట్ వైఎస్సార్సీపీదే. ఆ పార్టీ నేతలే ఎక్కువగా ఈ ‘సహజీవనం’ అనే ప్రస్తావన చేస్తుంటారు. పవన్‌ని విమర్శించడానికి అధికార పార్టీ నేతలకు ఇంకేమీ దొరకవు కాబట్టి. చేతనైతే, అధికారం తమ చేతిలో వుంది కాబట్టి, బాధితుల్ని ఆదుకోవాలి. అది మానేసి, జనసేనానిపై విరుచుకుపడితే ఎలా.? 12 మంది చనిపోవడానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ ప్రతినిథుల్ని ఇప్పటిదాకా అరెస్ట్ చేయకపోవడం.. ఈ ఘటనపై ప్రభుత్వానికి వున్న చిత్తశుద్ధిని చెప్పకనే చెబుతోంది.