మెగాస్టార్ చిరంజీవికీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కీ అస్సలు పొసగదంటూ తరచూ ప్రచారం జరుగుతుంటుంది. ‘మేం ఏం చేయగలం.? పిలుస్తున్నాం.. వాడే రావట్లేదు..’ అంటూ ఓ సందర్భంలో నాగబాబు అసహనానికి గురయ్యారంటే, అది అభిమానుల అత్యుత్సాహం కారణంగా.
తన అన్నయ్య చిరంజీవిని ఎప్పుడు కలవాలో, ఆయన్ని ఎలా గౌరవించాలో పవన్ కళ్యాణ్‌కి తెలుసు. అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి అన్నీ తానే అయి వ్యవహరించారు పవన్. ఇక, తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరఫున నాగబాబు గత ఎన్నికల్లో పోటీ చేసిన విషయం విదితమే. చరణ్, అల్లు అర్జున్.. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్‌కి మద్దతు పలుకుతూనే వున్నారు వీలు చిక్కినప్పుడల్లా. ఇదంతా ఓ లెక్క.
మెగాస్టార్ చిరంజీవి, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ ఆసక్తికరమైన ట్వీటేశారు. ఆ ట్వీట్‌లో ‘తోడ బుట్టిన ఆశయం’ అంటూ పవన్ కళ్యాణ్‌ని ప్రస్తావించారు చిరంజీవి. ఆ ఆశయం ప్రజాసేవ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. నిజానికి, అదొక్కటే కాదు. చిరంజీవి అంటేనే సేవా గుణం. ఆపదలో వున్నవారికి, సాయం కోరినవారికి ముందూ వెనుకా ఆలోచించకుండా సాయం చేయడం చిరంజీవి సద్గుణం. ఈ విషయంలో అన్నయ్యకు మించి.. అనే స్థాయిలోనే పవన్ కళ్యాణ్ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.
సినీ రంగంలో మెగాస్టార్ చిరంజీవి లెగసీని, పవన్ కళ్యాణ్ కొనసాగించారు. చిరంజీవి తనయుడు చరణ్, తండ్రిని మించిన తనయుడన్పించుకున్నాడనుకోండి.. అది వేరే సంగతి. రాజకీయాల విషయానికొస్తే, చిరంజీవి ప్రజా సేవలో తనదైన ముద్ర వేయాలనుకున్నారు. ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నారు. కానీ, రాజకీయం ఆయనకు అప్పట్లో కలిసి రాలేదు. అయితే, ఎమ్మెల్యే అయ్యారు.. ఆ తర్వాత రాజ్యసభకు ఎంపికై, కేంద్ర మంత్రి కూడా అయ్యారు. మరి, చిరంజీవి తోడబుట్టిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారా.? ఈ క్రమంలో చిరంజీవి పోషించబోయే పాత్ర ఏంటి.? వేచి చూడాల్సిందే.