Advertisement

కాపులు ప్లస్ బీసీలు ప్లస్…?

Posted : October 13, 2021 at 4:20 pm IST by ManaTeluguMovies

రాజకీయాల్లో కూడికలే ఉంటాయి. ఎంతలా కూడితే అంతలా లెక్క కుదురుతుంది. అయితే స్కూల్ బుక్స్ లో మాథమెటిక్స్ వేరు పాలిట్రిక్స్ లెక్కలు వేరు. ఎంతటి ఫార్టీ ఇండస్ట్రీలకు అయినా ఈ లెక్కలు ఎపుడో ఒకపుడు ఫెయిల్ చేస్తూ ఉంటాయి. అందుకే అంటారు ఇంజనీరింగ్ పాస్ అయిన వారు కూడా సోషల్ ఇంజనీరింగ్ లో దెబ్బ తినేస్తారు అని. మొత్తానికి జనసేనకు ఈ లెక్కల అవసరం బాగా పడుతోంది అనుకోవాలి. 2019 ఎన్నికల్లో ఓడాక పవన్ రెండేళ్ల పాటు బాగానే ఆలోచించారు. ఆ ఆలోచనల సారాన్ని ఆయన ఇపుడిపుడే బయటకు వదులుతున్నారు. ఈ మధ్య రాజమండ్రి టూర్ లో కాపులంతా ఒక్కటి కావాలి అని నినదించిన గొంతుతోనే ఇపుడు బీసీల రాగాన్ని అందుకుంటున్నారు.

తాజాగా బీసీ నాయకులతో పవన్ భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామం కిందనే చూడాలి. మరో వైపు పొలిటికల్ గా ఇది ఓల్డ్ ట్రెడిషన్ గానే పరిగణించాలి. ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ అయినా వైసీపీ అయినా బీసీల వెంట పడుతున్న సంగతి తెలిసిందే. ఇపుడు పవన్ కూడా అదే రూట్ పట్టారనుకోవాలి. అంటే ఏపీలో కాపులు బీసీలు కలిస్తే లెక్క ఎలా కుదురుతుంది అన్నదే పవన్ మార్క్ పాలిట్రిక్స్ గా ఉన్నట్లుంది. ఇంకో వైపు టీడీపీని సొంతం చేసుకున్న కమ్మలను కూడా దువ్వుతున్న పవన్ రాయలసీమకు వెళ్ళి రెడ్లు నా మిత్రులు అన్నారు. ఇలా నాకు కులం మతం లేవు అని చెప్పిన పెద్ద మనిషి నోటి వెంట ఈ కులాల పేర్లు గటగటా వస్తున్నాయి అంటే రాజకీయం మహిమ తప్ప పవన్ ది తప్పు కాదు.

రోమ్ లో ఉంటే అచ్చం రోమన్ గానే ఉండాలి. ఇక దివంగత నేత మాజీ ప్రధాని వాజ్ పేయి ఒక మాట ఎపుడూ క్యాడర్ కి చెప్పేవారు. రాజకీయాల్లో ఉన్నపుడు ఆ ఆటకు తగినట్లుగానే ఆడాలని. పవన్ కూడా ఇపుడు ఆ సత్యాన్ని తెలుసుకున్నారనుకోవాలి. మొత్తానికి 2024 ఎన్నికల కోసం ఆయన బాగానే కసరత్తు చేస్తున్నారు. ఏపీ రాజకీయం తీసుకుంటే కులాల సమరమే. ఇక ఏపీ జనాభాలో నూటికి యాభై శాతం పైగా బీసీలు ఉన్నారు. అలాగే కాపులు కూడా తరువాత స్థానంలో ఉంటారు. ఈ రెండూ కలిస్తే అద్భుతమే అవుతుంది.

కానీ కలయిక మాత్రం కష్టమే. అయితే అది అసాధ్యం కాదు. బీసీలు తెలుగుదేశం పార్టీ పెట్టాక బాగా చైతన్యం అయ్యారు. వారు కొన్ని దశాబ్దాల పాటు టీడీపీకి మద్దతుగా నిలిచి తమ ఉనికిని చాటుకున్నారు. అలాగే వైసీపీ వైపు కూడా బీసీలు నిలబడబట్టే 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి బంపర్ మెజారిటీ దక్కింది. ఇక బీసీలు అంటే ఏకమొత్తంగా ఒకే కులం ఉండదు అందులో ఎన్నో కులాలు ఉన్నాయి. ఎంతో మంది నాయకులు ఉన్నారు. వారికి ఎన్నో ఆశలు ఉన్నాయి. వారి రాజకీయ నినాదాలు విధానాలు కూడా వేరుగా ఉంటాయి. గుత్తమొత్తంగా వారి ఓట్లు అన్నీ ఒకే పార్టీకి పడతాయి అనుకుంటే పొరపాటే. అయితే మెజారిటీ ఓట్లు పడితే చాలు ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ విషయం తీసుకుంటే కనుక బీసీలకు మొదటి నుంచి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న టీడీపీకి పవన్ మార్క్ సోషల్ ఇంజనీరింగ్ వల్ల దెబ్బ పడుతుంది. ఇక జగన్ కూడా బీసీలకు పెద్ద పీట వేశారు. వారికి కార్పోరేషన్లు కూడా ఇచ్చారు. దాంతో వైసీపీ వైపు బీసీలు లేరు ఉండరు అనుకోవడం తప్పే. ఇపుడు జనసేన కూడా రంగంలోకి వచ్చింది కాబట్టి బీసీ ఓట్ల వాటా ఆ పార్టీకి ఎంత అన్నది వచ్చే ఎన్నికల్లో తేలుతుంది. మొత్తానికి జనసేనాని ఇన్నాళ్ళకు సరైన రాజకీయమే చేస్తున్నాడు అనుకోవాలి.


Advertisement

Recent Random Post:

హైదరాబాద్ మెట్రో రెండో దశకు పరిపాలనా అనుమతులు | Hyderabad Metro Second Phase | Full & Final

Posted : November 2, 2024 at 9:08 pm IST by ManaTeluguMovies

హైదరాబాద్ మెట్రో రెండో దశకు పరిపాలనా అనుమతులు | Hyderabad Metro Second Phase | Full & Final

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad