జనసేన పార్టీ కార్యకలాపాల కోసం సినిమాలకు బ్రేకిచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇందు కోసం ఏకంగా మూడున్నరేళ్లు సినిమాలకు దూరంగా వున్నారు. ఆ తరువాత బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ `పింక్` ఆధారంగా తెరకెక్కిన రీమేక్ మూవీ `వకీల్ సాబ్` చిత్రంతో మళ్లీ సినిమాల్లో బిజీగా మారారు.
ఈ చిత్రం బాక్సీఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో బ్లాక్ టు బ్యాక్ సినిమాలని ప్రకటించేశారు. అంగీకరించిన ప్రాజెక్ట్ లని వన్ బై వన్ పూర్తి చేసి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో బిజీగా మారిపోవాలని ప్లాన్ చేసుకుంటున్నారాయన.
ఇప్పటికే `భీమ్లానాయక్` చిత్రంతో ప్రేక్షకుల ముందు కొచ్చిన పవన్ త్వరలో మరో రెండు చిత్రాల్ని పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా `భీమ్లానాయక్` చిత్రాన్నిరీమేక్ చేసిన విషయం తెలిసిందే.
పవన్ తో కలిసి ఈ మూవీలో రానా కూడా నటించారు. బారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఫ్యాన్స్ థియేటర్ల వద్ద ఓ రేంజ్ లో జాతర చేసుకున్నారు.
మాసీవ్ పాత్రలో పవన్ ని చూడటంతో పూనకాలతో రెచ్చిపోయి థియేటర్ల వద్ద హల్ చల్ చేశారు. ఈ మూవీ తరువాత పవన్ ప్రస్తుతం క్రిష్ డైరెక్ట్ చేస్తున్న `హరి హర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్నారు. పిరియాడిక్ ఫిక్షనల్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీని ఏ. దాయాకర్ రావుతో కలిసి స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఈ మూవీ పూర్తయిన తరువాత పవన్ కల్యాణ్ మరో రీమేక్ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
తమిళంలో సముద్రఖని నటించి రూపొందించిన `వినోధాయ సితం` చిత్రాన్ని సముద్రఖని డైరెక్షన్ లో రీమేక్ చేయబోతున్నారట. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ బాధ్యతల్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి పవన్ అప్పగించారని `హరి హర వీరమల్లు` పూర్తి కాగానే పవన్ ఆ రీమేక్ ని పట్టాలెక్కిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఇద్దరు క్రేజీ స్టార్ డైరెక్టర్ ల చిత్రాలని పవన్ కల్యాణ్ వాయిదా వేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో పవన్ `భవదీయుడు భగత్ సింగ్` చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీతో పాటు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో రామ్ తాళ్లూరి నిర్మించనున్న భారీ చిత్రం కూడా చేయబోతున్నారంటూ వార్తలు వినిపించాయి.
అయితే రీమేక్ మూవీ కారణంగా హరీష్ శంకర్ చిత్రాన్ని వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేసిన పవన్ కల్యాణ్ .. సురేందర్ రెడ్డి మూవీని కూడా పక్కన పెట్టినట్టుగా చెబుతున్నారు. మరో ఆసక్తికరమైన రూమర్ ఏంటంటే సురేందర్ రెడ్డితో రామ్ తాళ్లూరి చేయాలనుకుంటున్న ప్రాజెక్ట్ ఏకంగా క్యాన్సిల్ అయిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత అనేది పవన్ టీమ్ అధికారికగా ప్రకటిస్తే కానీ ఓ స్పష్టత రాదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.