మెగాస్టార్ చిరంజీవి – మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కు గట్టిగా వారం రోజులు మాత్రమే ఉండటంతో మేకర్స్.. జెట్ స్పీడ్ తో ప్రమోషన్స్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు.
ఇందులో భాగంగా ఏప్రిల్ 23న హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి విజయవాడలో ఈ వేడుకను జరపాలని అనుకున్నారట. కారణమేంటో తెలియదు కానీ ఇప్పుడు వేదికను షిఫ్ట్ చేసుకున్నారు. అయితే దీనికిచిత్ర బృందంతో పాటుగా ఎవరెవరు గెస్టులుగా వస్తారనేది హాట్ టాపిక్ గా మారింది.
‘ఆచార్య’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారని టాక్ వచ్చింది. ఇప్పుడు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరియు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రానున్నారని ప్రచారం జరుగుతోంది.
కొరటాల శివ ‘ఆచార్య’ చిత్రాన్ని నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సందేశాత్మక అంశాలతో కూడిన కమర్షియల్ మూవీగా తీర్చిదిద్దారు. కథంతా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు మరియు సోషలిస్ట్ విధానాల చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఇప్పుడు అలాంటి భావాలు కలిగిన పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి సరైన గెస్ట్ అని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. లేటెస్టుగా RRR సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి.. రామ్ చరణ్ కోసమైనా ‘ఆచార్య’ సినిమా ఈవెంట్ లో భాగమయ్యే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్ ‘ఆచార్య’ ఈవెంట్ కు రాబోతున్నాడనే వార్తల్లో నిజమెంతన్నది తెలియదు కానీ.. అదే జరిగితే మెగా అభిమానులకు సినిమా విడుదలకు ముందే పండగ వచ్చినట్లే అవుతుంది. చాలాకాలం తర్వాత మెగా బ్రదర్స్ అండ్ సన్స్ ని ఒకే స్టేజీ మీద చూసే అరుదైన అవకాశం కలుగుతుంది. ఇది నిజంగా ఫ్యాన్స్ కు కనులవిందు అని చెప్పడంలో సందేహం లేదు.
అలానే పవన్ ఈ వేదికపై ఎలాంటి స్పీచ్ ఇస్తారు? ఇది సినిమా ఓపెనింగ్స్ కు ఎంత వరకు హెల్ప్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మెగా తండ్రీకొడుకులు తొలిసారిగా కలిసి నటిస్తున్న పూర్తి స్థాయి సినిమా కావడంతో ‘ఆచార్య’ కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్.. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు.
కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి – అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ సంగీతం సమకూర్చగా.. తిరునవుక్కరసు సినిమాటోగ్రఫీ అందించారు. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేయగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరి చిరు – చరణ్ కలిసి చేసిన ఈ ‘ఆచార్య’ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.