రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలు ఆగకపోతే హైకోర్టు సుమోటోగా తీసుకుని.. మహిళల రక్షణకై ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒకచోట మహిళలు, పసివాళ్లు, గర్భిణులు, మానసిక పరిణితిలేని వారు, విద్యార్ధినులు, యువతులపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలు ఆవేదన కలిగిస్తున్నాయని.. ఇది చాలా తీవ్రమైన విషయమని అన్నారు. ఇంత జరుగుతున్నా సీఎం జగన్ కనీసం సమీక్ష చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు.
మహిళలకు రక్షణ కల్పించి వారు ధైర్యంగా తిరగే పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వాన్ని తాము నిందించడం లేదని.. సూచన మాత్రమే చేస్తున్నామని అన్నారు. మృగాళ్ల బారి నుంచి తల్లిదండ్రులే తమ బిడ్డలను కంటికిరెప్పలా కాపాడుకోవాలని అన్నారు. బాధ్యత గల హోదాల్లో ఉన్నవారే తల్లిదండ్రుల పెంపకాన్ని తప్పుబట్టేలా మాట్లాడటం సరికాదని అన్నారు. ప్రస్తుత పాలకులను విశ్వసించేలా లేవు కాబట్టి.. పోలీసుల ఉన్నతాధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇటువంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.