బాలీవుడ్ చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక దాడి చేశారంటూ హీరోయిన్ పాయల్ ఘోష్ సంచల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో తనపై వస్తున్న ఆరోపణలపై అనురాగ్ కశ్యప్ మౌనం వీడారు. అవన్నీ నిరాధారమైనవని కొట్టిపారేశారు. ఈ మేరకు హిందీలో ట్వీట్ చేశారు. “వావ్, నా నోరు మూయించడానికి చాలా సమయం పట్టింది. ఈ ప్రయత్నంలో ఎన్నో అబద్ధాలు ఆడావు. మీరూ ఒక స్త్రీ అయినప్పటికీ ఎందరో ఆడవాళ్లను ఇందులోకి లాగారు.” (చదవండి: కశ్యప్‌పై పాయల్ లైంగిక దాడి ఆరోపణలు)
కొంచెమైనా గౌరవాన్ని కాపాడుకోండి మేడమ్.. నేను చెప్పదలచుకుందేంటంటే.. మీ ఆరోపణలన్నీ నిరాధారమైనవే. నాపై ఆరోపణలు వేసే క్రమంలో బచ్చన్ కుటుంబాన్ని, నా ఆర్టిస్టులను ఇందులో లాగావు. కానీ విఫలమయ్యావు. నేను రెండు పెళ్లిళ్లు చేసుకున్నాను. ఇది నేరం అంటే నేను అందుకు అంగీకరిస్తాను. కానీ నాతో కలిసి పని చేసిన మహిళలు ఎవరితోనూ చెడుగా ప్రవర్తించలేదు, అలాంటి వాటిని సహించను కూడా!” అని అనురాగ్ పేర్కొన్నారు. కాగా ఈ వివాదంతో బాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. పాయల్‌కు కంగనా మద్దతు తెలుపుతండగా, అనురాగ్‌కు తాప్సీ సపోర్ట్‌గా నిలిచారు. కాగా పాయల్ ఘోష్ బాలీవుడ్‌లో కన్నా తెలుగులోనే ఎక్కువ సినిమాల్లో కనిపించారు. ఊసరవెల్లి, మిస్టర్ రాస్కెల్, ప్రయాణం సహా పలు చిత్రాల్లో నటించారు.