మంత్రి పేర్ని నాని సినిమా టిక్కెట్ల వ్యవహారంపై చాలా నీతి వాక్యాలు చెప్పారు, చెబుతూనే వున్నారు. సినిమా అనేది వినోదమనీ, ఆ వినోదాన్ని సామాన్యుడికి తక్కువ ధరకు అందించడమే తమ ప్రభుత్వమనీ లెక్చర్లు దంచేస్తున్నారు.
సినిమా టిక్కెట్ల సంగతిని పక్కన పెడదాం. బస్సు ఛార్జీల సంగతేంటి.? తెలంగాణ ఆర్టీసీ సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నా, సాధారణ చార్జీలే వసూలు చేస్తోంది. కానీ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అలా కాదు.. ప్రత్యేక బస్సుల పేరుతో అదనపు దోపిడీకి తెరలేపింది. బస్సు ఛార్జీలపై 50 శాతం అదనం.. అనే సూత్రాన్ని పాటిస్తోంది.
నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది ప్రభుత్వ పెద్దల తీరు.. అనడానికి నిదర్శనమిదేనంటూ ఆర్టీసీ బస్సు ప్రయాణీకులు ఉస్సూరుమంటున్నారు. ఏపీఎస్ఆర్‌టీసీకి ‘నై’.. తెలంగాణ ఆర్టీసీకి జై.. అంటున్నారు ఏపీకి చెందిన ప్రయాణీకులు కూడా.
ఆర్టీసీ సంగతి కాస్సేపు పక్కన పెడదాం. రవాణా శాఖ మంత్రిగారికి, పండగ పేరుతో ప్రైవేటు బస్సుల దోపిడీ కనిపించకపోవడం శోచనీయం. వినోదాన్ని సామాన్యుడికి అందుబాటు ధరలో ఇవ్వడం సబబేగానీ, ప్రయాణీకులకు అందుబాటు ధరలో ప్రయాణ సౌకర్యాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యత కాకపోతే ఎలా.?
ఆర్టీసీ అదనపు బాదుడు 50 శాతం అయితే, ప్రైవేటు దోపిడీ 100 శాతం, ఆపైన.. అంటే అవసరాన్ని బట్టి రెండొందలు, మూడొందల శాతం కూడా పెరిగిపోతోంది. మరి, వ్యవస్థలు ఏం చేస్తున్నట్టు.? ఇంకేం చేస్తాయి, నిద్రపోతున్నాయ్. అసలు ఈ విషయమై రవాణా శాఖ తీసుకుంటున్న చర్యలేమిటో మంత్రివర్యులు చెప్పరాయె.
సినిమా టిక్కెట్టుది ఏముంది మహా అయితే.. ఓ యాభై లేదంటే వంద రూపాయలు అదనం. మరీ గట్టిగా అంటే ఓ రెండొందల రూపాయల వరకు అదనం వుంటుందేమో. బస్సు ఛార్జీలు అలా కాదు కదా.! దూరాన్ని బట్టి అదనంగా వెయ్యి రూపాయల నుంచి ఐదారు వేల రూపాయల వరకు దోపిడీ జరుగుతోంది.
ముందు నుంచి చీమలు కూడా వెళ్ళకూడదు, వెనకాల నుంచి ఏనుగులు పారిపోయినా ఫర్వాలేదు. ఎందుకంటే, ఏనుగుల వెనుక రాజకీయం వ్యవహారాలుంటాయ్ మరి.!