Advertisement

ఇన్‌సైడ్ స్టోరీ: ఇంకేం చేస్తాం.. కేంద్రానికి లేఖలు రాస్తాం.!

Posted : February 7, 2021 at 3:51 pm IST by ManaTeluguMovies

చేవ చచ్చిన ఆంధ్రుడు.. అన్న మాట ఇప్పుడు ఆంధ్రుల నోట గట్టిగా వినిపిస్తోంది. ఏదో, సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం తమ మీద తామే ఆంద్రులిలా సెటైర్లు వేస్తున్నారనుకుంటే అది పొరపాటే. రాజకీయ నాయకత్వం వెర్రితలలు వేస్తున్న వేళ నిజంగానే ఆంధ్రులు చేవ చచ్చినవాళ్ళలా మారిపోవాల్సి వస్తోంది. ఉమ్మడి ఆంధ్రపదేశ్ రెండుగా విడిపోతే ‘లాభమే’ అని ఓ రాజకీయ ప్రముఖుడు గతంలో సెలవిచ్చాడు. ఆయన ఇప్పుడు ఓ కీలక శాఖకు మంత్రిగా వున్నాడు. ఏ పార్టీ ద్వారా అయితే రాజకీయంగా ఎదిగాడో, తన అవసరం తీరాక.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశాడాయన.

ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసినవారిలో చాలామంది సీమాంధ్రకు చెందినవారే.. అందునా రాయలసీమకు చెందినవారు. కానీ, ఏం లాభం.? వెనుకబాటుతనంలో రాయలసీమకి వున్న ఘనత అంతా ఇంతా కాదు. ఆంధ్రపదేశ్ కూడా ఇప్పుడు వెనుకబడిన రాష్ట్రాల కేటగిరీలోకి వెళ్ళపోయింది.. అది విభజన పుణ్యమే. ‘ప్రత్యేక హోదా.. పార్లమెంటు ద్వారా రాష్ట్రానికి సంక్రమించిన హక్కు’. ఏం లాభం.? ఆ హక్కుని సాధించుకోలేని దురవస్థ ఆంధ్రపదేశ్‌ది. రైల్వే జోన్‌ని సాధించగలిగామా.? రాజధానిని నిర్మించుకోగలిగామా.? పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకోగలుగుతున్నామా.? చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ప్రత్యేక హోదా దండగ.. అని సెలవిచ్చారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రతిపక్షంలో వున్నప్పుడు నిరాహార దీక్షలు చేసి, అధికారంలోకి వచ్చాక లేఖలు రాస్తున్నారు. ఈ లేఖల్లో పస వుంటే, ఏనాడో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేది.

ప్రత్యేక హోదాపై రాసిన లేఖలు ఏమయ్యాయో తెలిసి కూడా, విశాఖ ఉక్కు విషయంలో కేంద్రానికి లేఖ రాశారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఎవర్ని మభ్యపెట్టడానికి ఈ లేఖలు.? విశాఖ ఉక్కు కర్మగారానికి దాదాపు 19 వేల ఎకరాల భూములున్నాయట.. వాటి విలువ లక్ష కోట్లు వుంటుందట. మొత్తంగా ఉక్కు కర్మాగారాన్ని లక్షా డెబ్భయ్ ఐదు వేల కోట్లకు అమ్మేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాదు కాదు, 2 లక్షల కోట్లకుపైనే సమకూర్చుకోవాలన్నది కేంద్రం ఆలోచన అనే ప్రచారమూ జరుగుతోంది. మోడీ ప్రధాని అయ్యాక, దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నదే నిజమైతే, ప్రతిష్టాత్మక పరిశ్రమల్ని ఎందుకు అమ్మేసుకోవాలట.? ఇది ప్రశ్నించలేని చేవ చచ్చిన నాయకత్వం.. ఆంధ్రపదేశ్‌లో వుండబట్టే, రాష్ట్రానికి హోదా రాలేదు.. రైల్వే జోనూ రాలేదు.. రాజధానీ లేదు.. పోలవరం ప్రాజెక్టూ పూర్తి కాలేదు.. అవేవీ జరగలేదు సరికదా, వున్న ఉక్కు పరిశ్రమ కూడా అమ్ముడైపోతోంది.


Advertisement

Recent Random Post:

సోషల్‌ మీడియాలో హద్దు మీరితే దండనే | CM Chandrababu | Strict Actions On Social Media Fake Posts

Posted : November 6, 2024 at 10:00 pm IST by ManaTeluguMovies

సోషల్‌ మీడియాలో హద్దు మీరితే దండనే | CM Chandrababu | Strict Actions On Social Media Fake Posts

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad