‘నీకు తెలంగాణలో ఏసీబీ వుంటే, నాకు ఆంధ్రపదేశ్‌లో సీఐడీ వుంది.. ఖబడ్దార్..’ అంటూ కొన్నాళ్ళ క్రితం అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి అల్టిమేటం జారీ చేశారు. ‘ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికావ్.. నిన్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు..’ అంటూ కేసీయార్, చంద్రబాబుకి చేసిన హెచ్చరిక నేపథ్యంలో చంద్రబాబు నుంచి వచ్చిన కౌంటర్ ఎటాక్ అది.
ఓటుకు నోటు కేసుకి కౌంటర్ ఎటాక్ పోన్ ట్యాంపరింగ్ కేసు అప్పట్లో. ఓ ముఖ్యమంత్రి ఫోన్ సంభాషణ, ఇంకో రాష్ట్ర ప్రభుత్వం ఎలా రికార్డ్ చేయగలుగుతుంది.? అన్న చర్చ అప్పట్లోనే జరిగింది. కానీ, దాన్ని అంతా లైట్ తీసుకున్నారు. కారణం, దిక్కుమాలిన రాజకీయం.
ఇప్పుడు దేశమంతా ఉలిక్కిపడుతోంది. ఫోన్ హ్యాకింగ్.. ఇజ్రాయెల్ సంస్థ, దేశంలో చాలామంది ప్రముఖుల ఫోన్లను హ్యాక్ చేసిందన్నది తాజాగా దేశాన్ని కుదిపేస్తోన్న అంశం. పలువురు కేంద్ర మంత్రులు కూడా హ్యాకింగ్ బాధితులేనట. కొందరు న్యాయమూర్తులూ ఫోన్ హ్యాకింగ్ బాధితులని మీడియాలో కథనాలొస్తున్నాయి.
బీజేపీకి రాజకీయ ప్రత్యర్థులుగా చెప్పబడుతోన్న చాలామంది ఈ హ్యాకింగ్ బాధితుల లిస్టులో వున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, పలువురు మీడియా రంగ అధిపతులూ.. హ్యాకింగ్ బారిన పడినట్లు తెలుస్తోంది. అంటే, మొత్తంగా భారత ప్రజాస్వామ్యమే పెను ప్రమాదంలోకి నెట్టివేయబడిందన్నమాట హ్యాకింగ్ కారణంగా.
అధికారంలో వున్నోళ్ళు, తమ రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బకొట్టడానికి, ఈ హ్యాకింగ్ సౌకర్యాన్ని బాగా వినియోగించుకునే అవకాశాలున్నాయి. దేశంలో గడచిన ఏడేళ్ళలో జరిగిన ఎన్నికల్ని తీసుకుంటే, ప్రతిసారీ హ్యాకింగ్, ట్యాంపరింగ్ ఆరోపణలు వినిపిస్తూనే వున్నాయి. అధికారంలో వున్నోళ్ళు తమను వేధిస్తున్నారనీ, తమపై నిఘా పెట్టారనీ అభ్యర్థులో, లేదంటే పార్టీలో ఆరోపించడం చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా దేశాన్ని కుదిపేస్తోన్న హ్యాకింగ్ వ్యవహారం నిజానికి ఎప్పుడో దేశంలో ప్రజాస్వామ్యానికి పాతరేసిందని అర్థం చేసుకోవాలేమో.