ముకుందతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది పూజ హెగ్డే. ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. ఈ రెండు సినిమాలు కూడా ఓ మోస్తరుగానే ఆడాయి. ఇక ఆపై బాలీవుడ్, టాలీవుడ్ లో చేసిన సినిమాలు అన్నీ బోల్తాకొట్టాయి. అయినా కానీ పూజ హెగ్డే అవకాశాలకు కొదవ లేకుండా పోయింది. డీజే పూజ కెరీర్ ను పూర్తిగా మార్చేసిందని చెప్పాలి. ఈ సినిమాలో ఆమె చేసిన గ్లామర్ షో దర్శక నిర్మాతలను ఆమె వద్దకు క్యూ కట్టేలా చేసాయి.
ఇక గత రెండేళ్లుగా పూజ హెగ్డేకు టాలీవుడ్ లో తిరుగు లేకుండా పోతోంది. అరవింద సమేత, మహర్షి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న పూజ, గద్దలకొండ గణేష్ లో చిన్న పాత్రే అయినా మెప్పించింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సాధించింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన నటిస్తోన్న పూజ, తెలుగులో సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది.
ఇటీవలే మీడియా, కెరీర్ ఆరంభంలో తీసుకున్న నిర్ణయాలకు ఇప్పటికీ ఏమైనా తేడాలు గమనించారా అని అడగ్గా.. కెరీర్ ఆరంభంలో నేను చాలా తప్పులు చేశా. ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలో తెలియక సతమతమయ్యా. అయితే ఇప్పుడు కథల విషయంలో క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా మన పాత్ర చిన్నదా పెద్దదా అని కాకుండా దాని ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందనేది చూసుకోవాలని తెలిసింది.
ఉదాహరణకు గద్దలకొండ గణేష్ లో శ్రీదేవి పాత్ర తీసుకుంటే అది నా మనసుకు చాలా దగ్గరైన పాత్ర. ఉండేది కాసేపైనా శ్రీదేవి పాత్ర గుర్తుండిపోతుంది. అలాంటి పాత్రలు వస్తే నిడివి ఎంతన్నది కూడా పట్టించుకోను అంటోంది.