లాక్ డౌన్ వల్ల దారుణంగా దెబ్బ తిన్న రంగాల్లో ఫిలిం ఇండస్ట్రీ ఒకటి. నిర్మాతల కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆల్రెడీ పూర్తి చేసిన సినిమాలు విడుదలకు నోచుకోక వడ్డీల భారం పెరిగిపోతోంది. చిత్రీకరణ మధ్యలో ఉన్న సినిమాల బడ్జెట్టూ పెరిగిపోతోంది. లాక్ డౌన్ వేళ స్టాఫ్‌ను మెయింటైన్ చేయడం తలకు మించిన భారంగా మారిపోయింది. చిత్రీకరణలకు అనుమతులిచ్చినా.. అనేక పరిమితుల మధ్య, అదనంగా ఖర్చు పెట్టుకుని షూటింగ్స్ చేయడమూ కష్టంగా ఉంది. దీంతో నిర్మాతలు పూర్తిగా మునిగిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది చూసి వివిధ ఇండస్ట్రీల్లో నటీనటులు, టెక్నీషియన్లు పరిస్థితులు చక్కబడే వరకు పారితోషకాలు తగ్గించుకోవడంపై చర్చలు నడుస్తున్నాయి. కోలీవుడ్లో ఇప్పటికే ఈ మేరకు నిర్ణయం కూడా జరిగినట్లు వార్తలొచ్చాయి. కొందరు ఆర్టిస్టులు స్వచ్ఛందంగా పారితోషకాలు తగ్గిస్తున్నారు కూడా.
టాలీవుడ్లోనూ ఇది అమలు చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఐతే నిర్మాతలు పారితోషకాలు తగ్గించడం గురించి ఆలోచిస్తుంటే.. ఇలాంటి సమయంలో ఓ కథానాయిక తన పారితోషకాన్ని మరింత పెంచినట్లు వార్తలొస్తుండటం విశేషం. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ప్రస్తుత టాలీవుడ్ నంబర్ వన్ అనదగ్గ పూజా హెగ్డే. అరవింద సమేత, వాల్మీకి, అల వైకుంఠపురములో.. ఇలా వరుస సక్సెస్‌లతో పూజ డిమాండ్ మామూలుగా లేదిప్పుడు. కొన్నేళ్ల వరకు ఆమె డైరీ ఖాళీగా లేదు. టాలీవుడ్లోనే కాక బాలీవుడ్లోనూ ఆమెకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఈ డిమాండ్ చూసి… ఆమె తన పారితోషకాన్ని అర కోటి పెంచేసిందట. ఇంతకుముందు రూ.1.5 కోట్లు పుచ్చుకుంటున్న ఆమె.. ఇప్పుడు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తోందట. పూజకు ఉన్న క్రేజ్, డిమాండ్, ఆమె వల్ల సినిమాకు జరిగే మేలు.. ఇలా అన్నీ చూసుకుని అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా వెనుకాడట్లేదని సమాచారం.