బాలయ్య సినిమాకు సంబంధించి ఒకే ఒక్క షెడ్యూల్ పూర్తయింది. అందులో కూడా 2 సీన్లు, ఒక ఫైట్ మాత్రమే పూర్తిచేశారు. అయినప్పటికీ ఆ మెటీరియల్ తోనే అద్భుతమైన టీజర్ కట్ చేసి వదిలారు. కానీ ప్రభాస్ సినిమాకు సంబంధించి మాత్రం ఈ పని చేయలేకపోయారు. సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. చేతిలో చాలా ఫూటేజ్ ఉంది. కానీ టీజర్ రిలీజ్ చేయడానికి మాత్రం నిర్మాతలకు చేతులు రావడం లేదు. టీజర్ సంగతి పక్కనపెడితే.. కనీసం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయడం లేదు.
సరిగ్గా ఇక్కడే ప్రభాస్ ఫ్యాన్స్ కు కోపం వస్తోంది. అంత మెటీరియల్ పెట్టుకొని ఏదో ఒకటి రిలీజ్ చేయొచ్చు కదా అంటారు అభిమానులు. చివరికి టైటిల్ కూడా ప్రకటించలేని దుస్థితిలో నిర్మాతలు ఉన్నారంటూ బాహాటంగానే తిట్టిపోస్తున్నారు. ఒక దశలో “బ్యాన్ యూవీ క్రియేషన్స్” అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అయిందంటే పరిస్థిని అర్థం చేసుకోవచ్చు. అయితే నిర్మాతలు ఇలా వ్యవహరించడానికి అసలు రీజన్ వేరే ఉందని తెలుస్తోంది.
ప్రభాస్ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రమోషనల్ మెటీరియల్ రిలీజ్ చేయకపోవడానికి ముఖ్యంగా 2 రీజన్స్ చెబుతున్నారు కొంతమంది. అందులో ఒకటి ప్రీ-రిలీజ్ బిజినెస్. ఈ సినిమాకు సంబంధించి కనీసం శాటిలైట్, డిజిటల్ డీల్స్ కూడా పూర్తవ్వలేదు. సాహో సినిమాకు నిన్నమొన్నటివరకు శాటిలైట్ బిజినెస్ పూర్తిచేయలేకపోయారు మేకర్స్. అతి కష్టమ్మీద జీ తెలుగు ఛానెల్ కు అమ్ముకున్నారు. అలాంటి పరిస్థితి తాజా చిత్రానికి రాకూడదనేది ఆలోచన. అంతోఇంతో బిజినెస్ మొదలైన తర్వాత ప్రచారం స్టార్ట్ చేయాలని ఊరుకున్నారు.
ఇక రెండో రీజన్ ఏంటంటే.. సినిమాకు సంబంధించి బ్యాలెన్స్ షూట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. అటు రిలీజ్ డేట్ పై కూడా స్పష్టత లేదు. ఈ ఏడాది రిలీజ్ అవుతుందా, వచ్చే ఏడాదికి వాయిదా పడుతుందా నిర్మాతలే చెప్పలేకపోతున్నారు. ఇలాంటి టైమ్ లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే టీజర్ అడుగుతారు, టీజర్ రిలీజ్ చేస్తే సింగిల్స్ అడుగుతారా.. సింగిల్స్ రిలీజ్ చేస్తే ట్రయిలర్ అడుగుతారు. అందుకే ఎందుకొచ్చిన తలనొప్పి అని చెప్పి మొత్తంగా ప్రచారాన్ని పక్కనపెట్టారు.
ప్రభాస్ సినిమాకు సంబంధించి నిర్మాతల ఆలోచనలు ఇలా సాగుతున్నాయి. సో.. ఫ్యాన్స్ కు ఇంకొన్నాళ్ల వెయిటింగ్ తప్పదు. అన్నట్టు త్వరలోనే ప్రభాస్-రాధాకృష్ణ మూవీకి సంబంధించి మరికొన్ని రోజుల్లోనే ఫస్ట్ లుక్ రాబోతున్నట్టు ఈమధ్య ప్రచారం జరిగింది. అది కూడా ఉత్తుత్తిదే అంటున్నారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాకు ఇంకా సంగీత దర్శకుడు ఎవరనేది ఫిక్స్ అవ్వలేదు.