ఓ పేరున్న దర్శకుడు వెళ్లి స్టోరీ అవుట్‍లైన్ చెప్పేస్తే సినిమా చేసేద్దామని చెప్పేస్తుంటారు అగ్ర హీరోలు. అయితే ప్రభాస్ ఇప్పుడా స్టేజ్ దాటిపోయాడు. తనపై అయిదు వందల కోట్ల బిజినెస్ ఆధారపడి వుండడంతో కేవలం ఐడియాలు చెబుతోన్న దర్శకులకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఎంత పేరున్న దర్శకుడయినా కానీ తనకు ‘సినిమా’ చూపిస్తేనే ఓకే అంటున్నాడు. స్టార్ డైరెక్టర్లు అవుట్‍లైన్స్ చెబుతుంటారే తప్ప ముందే బౌండ్ స్క్రిప్ట్ ఇవ్వరు.
అందుకే ప్రభాస్‍ని ఇటీవలి కాలంలో కలిసిన ఏ పెద్ద దర్శకుడికీ గ్రీన్ సిగ్నల్ దక్కలేదు. నాగ్ అశ్విన్, ఓం రౌత్ ఇద్దరూ తాము ఏం తీయబోతున్నదీ, ఎలా చేయబోతున్నదీ కూడా ఫుల్ ప్రజెంటేషన్ ఇచ్చి దాదాపుగా సినిమానే చూపించారట. వారి హోమ్‍వర్క్, క్లారిటీ నచ్చడంతో ఇక ఆ ప్రాజెక్టులు కాదనడానికి ప్రభాస్‍కి కారణం కనిపించలేదు. అగ్ర దర్శకులతో మాత్రమే పని చేయాలని కూర్చుంటే కుదరదని ప్రభాస్ గ్రహించాడు. అందుకే చేయగలడని నమ్మకం వున్న ఏ దర్శకుడికి అయినా తన డేట్స్ ఇచ్చేస్తున్నాడు. ప్రభాస్‍తో సినిమా చేయాలని వున్న ఏ దర్శకుడు అయినా ఇకపై పూర్తిగా అన్నీ సిద్ధం చేసుకుని వెళ్లక తప్పదు.