తన తండ్రి స్మారకంగా అడవిని దత్తత తీసుకున్నాడు నటుడు ప్రభాస్. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఖాజీపల్లి అర్బన్ ఫారెస్ట్ ను ప్రభాస్ దత్తత తీసుకున్నాడు. ఔట్ రింగ్ రోడ్డుకు పక్కనే 1650 ఎకరాల విస్తీర్ణంలో ఈ అటవీ భూమి విస్తరించి ఉంటుంది. దీని అభివృద్ధికి గానూ ప్రభాస్ రెండు కోట్ల రూపాయల మొత్తాన్ని ఖర్చు చేయడానికి ముందుకొచ్చారు. అవసరాన్ని బట్టి మరింత మొత్తాన్ని ఖర్చు చేయడానికి కూడా ప్రభాస్ సానుకూలంగా ఉన్నారట.
ఈ అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం కూడా సోమవారం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చొరవతో ప్రభాస్ ఈ దత్తత కార్యక్రమానికి ముందుకు వచ్చారట. అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇన్నాళ్లూ పలువురు సెలబ్రిటీలు పల్లెలను దత్తత తీసుకున్నట్టుగా ప్రకటించారు. జంతువులను, పిల్లల బాధ్యతలు తీసుకున్న వారూ ఉన్నారు. అటవీ భూములను దత్తత తీసుకోవడం ఆసక్తిదాయకమైన అంశం. మరింత అటవీ భూముల దత్తత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నట్టుగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పేర్కొన్నారు. మరి ముందు ముందు సెలబ్రిటీలు ఈ తరహాలో ముందుకు వస్తారేమో!