రీమేక్ సినిమాలకు పెద్ద సమస్య.. అన్ని విషయాల్ని ఒరిజినల్ తో పోల్చి చూస్తుంటారు. మక్కీకి మక్కీ దించినా తప్పే. అలా అని కాస్తంగా స్వేచ్ఛను తీసుకొని నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసుకున్నా కష్టమే. వంటకంలో ఏ చిన్న తేడా వచ్చినా మొత్తానికే మోసం వచ్చే పరిస్థితి. రీమేక్ లో ఇలాంటి కష్టాలు తప్పవు. అందునా.. స్టార్ హీరోలు చేసే రీమేక్ ల విషయంలో కష్టాలు మామూలుగా ఉండవన్న సంగతి తెలిసిందే.
మరో నాలుగు రోజుల్లో వెంకటేశ్ నటించిన మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘నారప్ప’ ఓటీటీ ఫ్లాట్ ఫాం ద్వారా విడుదల కానుందన్న సంగతి తెలిసిందే. థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేకపోవటంతో.. మిగిలిన వారి అభ్యంతరాల్ని పక్కన పెట్టేసి.. సంప్రదాయ పద్దతిలో కాకుండా కొత్త ట్రెండ్ కు తెర తీసేలా.. ఓటీటీలో విడుదలకు చిత్ర నిర్మాత ఓకే అనేశారు. దీంతో.. ఈ సినిమాకు సంబంధించిన విశేషాల మీద కొత్త ఆసక్తి వ్యక్తమవుతోంది.
రోటీన్ కు భిన్నమైన ఈ సినిమాలో చాలానే విశేషాలు ఉన్నాయి. సాధారణంగా హీరోయిన్ అన్నంతనే గ్లామర్ కు పెద్ద పీట వేయటమే కాదు.. వీలైనంత అందంగా కనిపించేందుకు తెగ కసరత్తు చేస్తుంటారు. కానీ.. నారప్పలో మాత్రం అందుకు భిన్నం. పాత్ర స్వభావ రీత్యా.. ఇందులోని పాత్రలన్ని డీ గ్లామర్ గా కనిపించాలి. ఏ ఫ్రేమ్ లో అయినా కాస్తంత బ్రైట్ గా కనిపిస్తే.. వెంటనే వచ్చి ముఖాన్ని డల్ గా మార్చేసే వారంట. ఇలా సినిమాలో ముఖాలు ఏవీ ఫ్రెష్ గా కనిపించవని చెబుతోంది నటి ప్రియమణి.
సాధారణంగా ఏ సినిమాలో అయినా హీరోయిన్ పాత్ర స్కిన్ టోన్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. నారప్పలో మాత్రం అందుకు భిన్నంగా స్కిన్ టోన్ డార్క్ చేసేందుకు కష్టపడేవారట. దీంతో.. డల్ గా కనిపించటానికి చాలానే కష్టపడాల్సి వచ్చిందని చెప్పింది. ఈ మూవీలో ప్రియమణి పాత్ర పేరు సుందరమ్మ. పెళ్లీడుకు వచ్చిన కొడుకు ఉంటారు. సినిమాలో కథకు తగ్గట్లు.. తన చీరను బాగా పైకెత్తి కట్టుకోవాల్సి వచ్చిందని.. దీంతో తన పర్సనల్ స్టాప్ సైతం.. అదేంటి మేడం.. మీరు చీరను అలా పైకెత్తి కట్టుకున్నారని అడిగేవారట.
తన సిబ్బంది ముంబయి వారు కావటంతో వారికి నేటివిటీ అర్థమయ్యేది కాదని.. దీంతో.. వారికి అర్థమయ్యేలా చెప్పాల్సి వచ్చేదన్నారు. అంతేకాదు.. ఈ సినిమాలో తన హెయిర్ స్టైల్ ను సైతం తానే చెప్పి చేయించుకున్నట్లు చెప్పారు. షూట్ లో ఎప్పుడైనా ముఖం కాస్తంత ప్రెష్ గా కనిపిస్తే చాలు.. వెంటనే వచ్చి డల్ చేసే వరకు ఊరుకునే వారు కాదని చెప్పింది. ఇలాంటి అనుభవం చాలా తక్కువ సందర్భాల్లోనే గ్లామర్ నటీమణులకు ఎదురవుతుందని చెప్పాలి.