ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు వై కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. మరో మూడు రోజుల్లో కేంద్ర భద్రతా బలగాలు ఏపీకి వచ్చి ఆయనకు రక్షణ కల్పించనున్నాయి. తనకు భద్రత కల్పించాలని కోరుకున్న అందరికి ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు.
అమరావతిలో రాజధానిని కాపాడాలంటూ మహిళలు గాంధేయ మార్గంలో నిరసన తెలుపుతుంటే.. వారిని కుక్కలతో పోలుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టటాన్ని తప్పు పట్టారు. ‘‘ఇది చాలా దారుణం’’ అని వ్యాఖ్యానించిన రఘురామ.. ‘‘ముఖ్యమంత్రిగారు వారు వేటకుక్కలై వేటాడే సమయం దగ్గరకు వస్తుంది’’ అని అన్నారు. పేరు చివరన రెండు అక్షరాలున్న వ్యక్తులనే కాపాడేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. రంగనాయకమ్మ అనే పెద్ద వయస్కురాలు ఎవరో పెట్టిన పోస్టును ఫార్వర్డ్ చేస్తే.. ఆమెపై కేసులు పెట్టినప్పుడు.. ఇలాంటి వారిపై కేసులు పెట్టకపోతే అపార్థం చేసుకోవాల్సి వస్తుందన్నారు.
అయోధ్యలోని రామమందిర భూమిపూజ కార్యక్రమాన్ని టీటీడీకీ చెందిన ఎస్వీబీసీ చానల్ ప్రసారం చేయకపోవటం దారుణమన్నారు. ముఖ్యమంత్రి జగన్ పై అభిమానంతో గుడి కడతానని పేర్కొన్న గోపాలపురం ఎమ్మెల్యే తీరును తప్ప పట్టారు. హిందువుల మనోభావాల్ని దెబ్బతీయొద్దన్న ఆయన.. త్వరలోనే తాను అమరావతి ప్రాంతంలో మనోధైర్య యాత్ర చేస్తానని చెప్పారు. ఏపీ రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం లేదన్న ఆయన.. అమరావతికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. రాజధాని ప్రాంతవాసులు అభద్రతా భావానికి గురి కావాల్సిన అవసరం లేదన్నారు. తన వైపు ఎక్కడా ఎలాంటి తప్పులు లేకుండా.. వేలెత్తి చూపించే అవకాశం లేకుండా జాగ్రత్తలు పడుతూనే విమర్శలు చేస్తున్న తీరు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.