వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. నిజాయితీ గల అధికారితో దీనిపై విచారణ చేయించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ నుంచి వ్యక్తులు విశాఖలో అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలను సుప్రీంకోర్టు కొట్టేసిందని.. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని అన్నారు. ప్రభుత్వ తీరు వల్లే అక్కడ 150 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు.
తమ ఎంపీలంతా తొలిసారి పార్లమెంట్ లో ప్రత్యేకహోదా కోసం గొంతెత్తారని.. సీఎం ఆదేశిస్తే తామంతా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయమని కోర్టును ఆశ్రయించడం రాజద్రోహం ఎలా అవుతుందని ప్రశ్నించారు. చంద్రబాబుతో తన వాట్సాప్ చాటింగ్ బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారని.. ఒకవేళ తాను మెసేజ్ చేస్తే కూడా అది రాజద్రోహం ఎలా అవుతుందని ప్రశ్నించారు.