రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదలకు ముందే వివాదాస్పదం అయ్యింది. ఇటీవల విడుదల అయిన రామరాజు ఫర్ భీమ్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే చివర్లో కొమురం భీమ్ పాత్ర పోషించిన ఎన్టీఆర్ ముస్లీం టోపీని పెట్టుకుని కనిపించడం చర్చనీయాంశం అయ్యింది. గిరిజన పుత్రుడు అయిన కొమురం భీమ్ పేరు పెట్టి ఆ పాత్రను ఇలా ముస్లీం వేషదారణలో చూపించడం ఏంటీ అంటూ చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అయితే జక్కన్నకు వార్నింగ్ ఇస్తున్నారు.
ఇటీవలే ఎంపీ సోయం బాపు రావు ఈ విషయమై మాట్లాడుతూ వెంటనే ఆ సన్నివేశాలు తీసి వేయాలి. అలాగే గొండు జాతి అందరికి కూడా జక్కన్న అండ్ టీం క్షమాపణలు చెప్పాల్సిందే. లేదంటే సినిమా విడుదల అవ్వనివ్వం. అయినా కూడా థియేటర్లు బద్దలు కొట్టేస్తాం అంటూ హెచ్చరించారు. ఇప్పుడు బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ విషయమై స్పందించి పరిస్థితిని మరింత సీరియస్ గా మార్చాడు.
ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. కొమురం భీమ్ ఆ కమ్యూనిటీ వారి చేతిలో చనిపోయాడు. ఇప్పుడు ఆ కమ్యూనిటీకి చెందిన వారి గెటప్ లో చూపించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇలాంటి పరిణామాలు అస్సలు సహించేది లేదు అంటూ రాజమౌళిని సున్నితంగా హెచ్చరించాడు. ఈ పరిణామాలు అన్ని చూస్తుంటే ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో అలాంటి సన్నివేశాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా భీమ్ అభిమానులు మరియు దేశ వ్యాప్తంగా ఉన్న గొండు జాతి వారు వ్యతిరేకించే అవకాశం ఉంది అనిపిస్తుంది. ఈ విషయంలో ఇప్పటి వరకు జక్కన్న నుండి కాని యూనిట్ సభ్యుల నుండి కాని స్పందన రాలేదు. త్వరలోనే రాజమౌళి వివరణ ఇచ్చే అవకాశం ఉందని అంతా ఎదురు చూస్తున్నారు.
Share