కరోనా కల్లోలం రేపుతూండటంతో ఆసుపత్రులన్నీ నిండిపోతున్నాయి. బెడ్లు, ఆక్సిజన్ దొరక్క బాధితులు అల్లాడిపోతున్నారు. బెడ్లు ఖాళీ లేకపోతే.. ఆంబులెన్సుల్లోనే ఆక్సిజన్ తీసుకుంటున్నారు. మరికొందరు చెట్టు కింద కూడా ఉండిపోతున్నారు. ఆసుపత్రి ఆవరణలోనే బెడ్ కోసం నిరీక్షించి నీరసించిపోతున్నారు. ఈక్రమంలో మసీదులు, కొన్ని హిందూ మందిరాలను కూడా ఐసొలేషన్ వార్డులకు వినియోగించుకునే అవకాశం కల్పించాయి. ఇప్పుడు ఈ కోవలోకి ప్రముఖ సినీ దిగ్గజం రామానాయుడు స్టూడియోస్ కూడా చేరింది.
విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియోను ఐసొలేషన్ వార్డులుగా మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. నిర్మాత సురేశ్ బాబు ఈమేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీంతో ఇకపై స్టూడియో కరోనా రోగులకు చికిత్సాలయంగా మారబోతోంది. ఇది నిజంగా మంచి నిర్ణయం. ఎందరో బాధితులకు ఇక్కడ చికిత్స లభించబోతోంది. మిగిలిన వారు కూడా అవకాశం ఉంటే ప్రభుత్వాలకు అండగా తమ స్థలాలను ఐసొలేషన్ వార్డులకు ఇవ్వాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుతున్నారు.