ఏపీ హైకోర్టులో వరుసగా జగన్ సర్కారు నిర్ణయాలను కొట్టేస్తూ తీర్పులు రావడం చూస్తూనే ఉన్నాం. ఈ వ్యవహారంలో ఏకంగా సీఎం తరఫు నుంచే కులం రంగు పులుముకుంది. ఆ తర్వాత అధికార పార్టీ నేతలు అదే బాటలో నడిచారు.
తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తప్పించడంపై హైకోర్టు జగన్ సర్కారును తప్పు పడుతూ తుది తీర్పు ఇచ్చింది. ఆయన్ని తొలగించేందుకు తెచ్చిన ఆర్డినెన్స్‌ను కొట్టేసింది. తిరిగి రమేష్‌ను పదవిలో నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో అందరి చర్చ వైకాపా వర్సెస్ చంద్రబాబు వ్యవహారంలా నడుస్తుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై కోర్టులో కోర్టులో పిటిషన్ వేసింది తెలుగుదేశం పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ నేత కామినేని శ్రీనివాస్ కేంద్ర పార్టీ అనుమతితో ఈ పిటిషను వేశారు. తనను తొలగించడంపై రమేష్ కుమార్ కూడా కోర్టులో పోరాడుతుండగా.. ఆయన్ని తొలగించేందుకు ఆర్డినెన్స్ తేవడాన్ని ఆక్షేపిస్తూ పిటిషన్ వేసింది బీజేపీ నేత కామినేని శ్రీనివాస్. ఆ పిటిషన్‌పై విచారణలో భాగంగానే హైకోర్టు తాజా తీర్పులిచ్చింది.
ఈ తీర్పు నేపథ్యంలో కామినేని శ్రీనివాస్ స్పందిస్తూ.. జగన్ ప్రతిదాన్నీ నెగెటివ్‌గా చూడటం మానుకోవాలన్నారు. కరోనా భయంతో రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేయాలని నిర్ణయించడం కరెక్టే అని, అందుకు గాను ఆయన్ని తప్పించాలనుకోవడం సరికాదని అన్నారు. ఈ విషయమై పిటిషన్ వేసేముందు తాను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమాచారం ఇచ్చానని, ఆయన అనుమతితోనే పిటిషన్ వేశానని ఆయన వెల్లడించారు.
దీన్ని బట్టి చూస్తే జగన్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు బీజేపీ అధినాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే కనిపిస్తోంది. రాష్ట్ర బీజేపీ.. జగన్ సర్కారు విషయంలో అవసరమైనంత దూకుడుగా వ్యవహరించట్లేదని, వారికి కేంద్ర పార్టీ నుంచి సహకారం లేదని.. వివిధ వ్యవహారాల్లో మోడీ అండ్ కో జగన్ సర్కారుకు పరోక్ష సహకారం అందిస్తోందని విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. ఐతే నిమ్మగడ్డ కేసు పర్యవసనాలు చూస్తే జగన్‌కు బీజేపీ వాయింపు మొదలైందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.