ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు, ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ గార్లకు నమస్కారం. సార్ ఇంతకాలం జర్నలిస్టులుగా అనేక మందికి అవకాశం కల్పించి, ఉపాధి ఇచ్చినందుకు ధన్యవాదాలు. కరోనా మహమ్మారి గత కొన్ని రోజులుగా కంటికి కనిపించని విధ్వంసానికి తెగబడింది. అనేక సంస్థల ఆర్థిక మూలాలు ఛిన్నాభిన్నం అయ్యాయి, అవుతున్నాయి. అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థల ఆర్థిక మూలాలు ఈ 21 రోజుల లాక్‌డౌన్‌కే విధ్వంమయ్యేంత బలహీనంగా ఆర్థిక పునాదులు లేవని నమ్ముతున్నాం. కానీ మీ సంస్థల నుంచి ఉద్యోగులను తొలగిస్తూ వీధినపడేయడానికి లాక్‌డౌన్ అనేది కేవలం ఒక సాకు మాత్రమే అని నమ్ముతున్నాం. అందుకే జర్నలిస్టులుగా మా ఆవేదన, ఆక్రోశాన్ని మీ దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నాం.
జర్నలిజం నేపథ్యం నుంచి వచ్చిన మీకు (రామోజీ, ఆర్‌కే) ఆ రంగంలోని పేపర్ బాయ్ మొదలుకుని స్ట్రింగర్లు, రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు…ఇలా అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల కష్టనష్టాల గురించి బాగా తెలుసు. మిగిలిన మీడియా సంస్థల అధిపతులకు జర్నలిజం నేపథ్యం లేదు. ఉదాహరణకు సాక్షి యాజమాన్యానికి రాజకీయంతో పాటు ఇతరత్రా వ్యాపార నేపథ్యం ఉంది. అందువల్ల జర్నలిస్టులను చూసే దృష్టి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు, ఇతరులకు తేడా ఉందని ఇంత కాలం నమ్ముతూ వచ్చాం. కరోనా విపత్తు నేపథ్యంలో ఆర్‌కే తన కొత్త పలుకులో కరోనానంతరం అతి పెద్ద సంక్షోభంలో పడేది మీడియా రంగమని రాశారు. కానీ తన నేతృత్వంలో నడుస్తున్న ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ అని ఎవరూ ఊహించలేకపోయారు.
ఎందుకంటే ఆర్‌కే రాతలు చూస్తే హిమాలయాలు దాటుతాయి. గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం తర్వాత అంతటి గొప్ప సంఘ సంస్కర్త, మదర్‌థెరిస్సా తర్వాత అంతటి మానవతామూర్తి ఆర్‌కే అని ఆ సంస్థ ఉద్యోగులతో పాటు బయటి సమాజం కూడా ఊహించింది. కానీ లాక్‌డౌన్ కొనసాగుతుండగానే ఉద్యోగుల జీవితాలకు లాక్‌డౌన్ విధిస్తారని, తడిగుడ్డలతో తన సంస్థ ఉద్యోగుల గొంతు కోస్తాడని ఏ జర్నలిస్టు ఊహించలేకపోయాడు. అందులోనూ ఒక జర్నలిస్టుగా అరకొర జీతాలతో ఏ రోజుకారోజు వలస కూలీల మాదిరిగా జీవితాలను నెట్టుకొచ్చే వేతన జీవులను నడిరోడ్డుపై ఇంత త్వరగా తోస్తారని ఊహించకపోవడం వల్లే ఈ ఆందోళన.
నిత్యం నీతి, నైతిక, మానవతా విలువల నామస్మరణ చేస్తూ, ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న ఆర్‌కే, రామోజీల అమానవీయతను లోకానికి చాటుదామనే ఉద్దేశంతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాం.
సెలవు అడిగితే ముప్పుతిప్పలు పెట్టే ఈనాడులో అడగందే లాంగ్ లీవ్ ఇస్తూ….సంస్థ నుంచి చాలా ప్లాన్‌గా “లీవ్” చేయడం ఒక్క ఈనాడు రామోజీకే చెల్లుతుంది.
జర్నలిజాన్ని నమ్ముకున్నందుకు జర్నలిస్టులకు చివరికి ఆకలి దప్పులు మిగిలాయి. ఇదే జర్నలిజాన్ని అమ్ముకున్నందుకు రామోజీ, ఆర్‌కేలకు ఏం దక్కాయో తెలుసుకుందాం.
రామోజీరావు గురించి ఇంటర్‌నెట్‌లో వెతకండి. ఆయన గురించి పరిచయ వాక్యాలు ఇలా కనిపిస్తాయి.
“చెరుకూరి రామోజీరావు భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనములో ప్రపంచములోనే అతిపెద్ద సినిమా స్టూడియో అయిన రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది”
కేవలం పచ్చళ్ల వ్యాపారంలోనే ఉంటూ రామోజీ గురించి ఇంత గొప్పగా రాసుకునే, చెప్పుకునే అవకాశం ఉండేదా? ఈనాడు అనే మీడియా సంస్థ ఉండటం వల్లే వేలాది ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్‌సిటీని నిర్మించుకోగలిగాడు. ఈనాడు, ఈటీవీలు ఉండటం వల్లే మార్గదర్శ చిట్‌ఫండ్‌లో ఆర్థిక అవకతవకలకు పాల్పడినా కనీసం కోర్టు మెట్లు కూడా ఎక్కడం లేదు. ఈనాడు అనే మీడియా చేతిలో ఉండటం వల్లే ప్రధాని మోడీ మొదలుకుని చంద్రబాబు, అమిత్‌షా, ఎల్‌కే అద్వాని, వైఎస్ జగన్ లాంటి వాళ్లు ఆయన చల్లని చూపు కోసం వెంపర్లాడారు.
తెలుగు సమాజంలో ఎందరో వ్యాపారులున్నారు. వాళ్లందరికీ లేని గుర్తింపు, పరపతి కేవలం రామోజీకి మాత్రమే ఏంటి? ఆ క్రెడిట్ కేవలం ఈనాడు అనే మీడియా సంస్థకు మాత్రమే దక్కుతుంది. మరి తనను అంచెలంచెలుగా పద్మభూషణ్ పురస్కారం తెచ్చే స్థాయికి కారణమైన ఈనాడు ఉద్యోగులను కరోనా కారణంతో ఇంటికి సాగనంపాలనుకోవడం న్యాయమా? ఇందుకేనా రామోజీకి పద్మభూషణ్ పురస్కారంతో ఈ దేశం గౌరవించుకుంది? ఇందుకేనా ఈనాడును తెలుగు సమాజం ఆదరించింది? జనం ఆదరాభిమానాలను సొమ్ము చేసుకుని, ఇక అవసరం లేదంటూ ఉద్యోగులను సాగనంపేందుకు లాంగ్ లీవ్‌లు ఇవ్వడం ఏం న్యాయం?
ఇదే రామోజీపై మార్గదర్శికి సంబంధించి అవకతవకలకు పాల్పడ్డారని నాటి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఫిర్యాదు చేయడం, అనంతరం కేసులకు వరకు వెళ్లడం తెలిసిందే. అప్పట్లో తనపై ఫిర్యాదు, కేసులను మీడియాపై దాడిగా ఈనాడు చిత్రీకరిస్తూ రోజుల తరబడి కథనాలు, పలు రంగాల్లోని ప్రముఖలతో ఇంటర్వ్యూలు ప్రచురించిన సంగతి తెలిసిందే. అంటే మీ వ్యాపారంలో అక్రమాలకు మీడియా ఓ అడ్డుగోడ మాత్రమే అన్నమాట. మీ అక్రమాల్లో మాత్రం జర్నలిస్టులకు భాగస్వామ్యం కల్పించారే….మరి మీ లాభాల్లో కాసింత సొమ్మును కష్టాల్లో ఉన్న జర్నలిస్టులకు పంచడానికి మనసు రాలేదమయ్యా రామోజీ? మార్గదర్శి చిట్‌ఫండ్ వ్యవహారంలో మీరు చెప్పింది నమ్మి అమాయకంగా రోడ్లు ఎక్కి మీడియాపై దాడిని అరికట్టాలని గొంతు చించుకుంటూ అరిచాం. పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నాం. ఈ వేళ మీరు లాంగ్‌లీవ్ పేరుతో ఉద్యోగాల నుంచి తొలగిస్తే దిక్కుతోచక పిచ్చి వాళ్లలా అరుస్తున్నారయ్యా!
ఇక తెలుగు సమాజంలో రామోజీ తర్వాత జర్నలిజం పితామహుడిగా తనను తాను ఊహించుకుంటున్న గొప్ప మేధావి వేమూరి రాధాకృష్ణ. ఆంధ్రజ్యోతి అంటే తెలుగు సమాజానికి వెలుగు ప్రసరించే అక్షర దీపమని ఆర్‌కే భావిస్తుంటారు. కానీ ఆ దీపం వెలగడానికి చమురైన జర్నలిస్టుల బతుకులను మాత్రం ఆర్‌కే అమానవీయంగా రోడ్డున పడేస్తున్నారు. కనీసం లాక్‌డౌన్ కాలం ముగియకుండానే తన ఉద్యోగులను రోడ్డుమీదికి ఈడ్చి పడేసి….మిగిలిన కంపెనీలకు ఓ దారి చూపిన ఘనత ఆర్‌కేకి మాత్రమే దక్కింది.
దమ్మున్న పత్రిక, దమ్మున్న చానల్ అని పదేపదే చెప్పుకునే ఆర్‌కే…ఆర్థికంగా, సామాజికంగా తన స్థాయి ఊహించని స్థాయికి ఎదగడానికి కారణమైన జర్నలిస్టులను అత్యంత అమానవీయంగా వీధిన పడేయడం ఆయనకే సాధ్యం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కార్లు తన పత్రికకు యాడ్స్ ఇవ్వలేదని ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసి….ఇది మీడియాపై దాడిగా పేజీలకు పేజీలు వార్తలు రాస్తూ తనకు నచ్చని పాలకులపై అక్కసు వెళ్లగక్కడం మనం తరచూ చూస్తూనే ఉన్నాం.
మరి మమ్మల్ని రోడ్డు పాలు చేసినందుకు ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఏమని ఫిర్యాదు చేయాలో తెలియని స్థితి. లోకంలోని అందరి బాధలు, కష్టనష్టాల గురించి రాసే జర్నలిస్టులు…తమను రోడ్డుపాలు చేసే వాళ్ల గురించి రాసుకోలేని దుస్థితి. ఇదే జర్నలిజంలోని విషాదం.
ప్రింట్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ప్రభుత్వంపై తప్పుడు, నిరాధార వార్తలు రాసే వాళ్లపై కేసులు లేదా ఇతరత్రా చర్యలు తీసుకునే అధికారాన్ని సంబంధిత శాఖ కార్యదర్శులకు కట్టబెడుతూ జగన్ సర్కార్ ఇటీవల జీవో ఆర్టీ నెంబర్ 2430 తీసుకొస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి గగ్గోలు పెట్టాయి. కలాలకు కళ్లెం వేస్తారా అంటూ తాటికాయంత అక్షరాలతో వార్తను పబ్లిష్ చేశాం. గంటల తరబడి టీవీ చానళ్లలో చర్చలు నిర్వహించాం.
మరి మీరిప్పుడు ఏకంగా మా కడుపుపై కొట్టారే… దీన్ని ఏమని పిలవాలో జర్నలిజానికి ఆద్యులుగా, తెలుగు రాష్ట్రాల్లో పితామహులుగా చెలామణి అవుతున్న మీరిద్దరూ చెప్పగలరా సార్? ప‌్రశ్నించడమే తప్ప పాటించడం తమ ఇంటావంటా లేవని మీరిద్దరూ చెబుతారా? అంతేలేండి ఈనాడును భగవద్గీతగా , ఆంధ్రజ్యోతిని తన జ్యోతిగా మార్చిన చంద్రబాబు ఇప్పుడు నోరు తెరవలేదెందుకు?
జగన్ సర్కార్ ఖజానాలో తగినంత సొమ్ము ఉన్నా ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తోందని రాసిన ఆర్‌కే…కేవలం మూడు వారాల లాక్‌డౌన్‌కే ఉద్యోగులను తొలగించేంత దుస్థితిలో ఉన్నాడా? మరి గత ఐదేళ్లలో చంద్రబాబు హయాంలో దోచుకున్న సొమ్మంతా ఏ కలుగులో దాచి పెట్టారు? మీకు లాభాలొస్తే ఏనాడైనా మీ మీడియా సంస్థల్లో పనిచేసేవాళ్లకు బోనస్‌లు ఇచ్చారా?
జగన్ సర్కార్‌కైతే ఓ నీతి, పత్రికా యజమానులుగా మీకు మరో నీతా? తమ ఉన్నతికి అక్షరాలెత్తిన కూలీలైన జర్నలిస్టులకు కనీసం రెండు నెలలు కూడా జీతాలు ఇవ్వలేని డొల్ల కంపెనీలా మీవి? ఎవరిని చూసుకుని మీరింత కాలం దమ్మున్న పత్రిక, దమ్మున్న చానల్ అని విర్రవీగారో, అలాంటి వాళ్లను కష్టకాలంలో అక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత లేదా? ఇంత కాలం మీ ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు అనేక నిద్రలేని రాత్రులను బలి పెట్టిన జర్నలిస్టు కుటుంబాలను వీధిన పడేస్తే…వాళ్ల ఇంట్లో పాల కోసం అలమటించే బిడ్డల ఆర్తనాదాలకు కారణం ఎవరు? జర్నలిస్టుల ఆకలిదప్పులకు బాధ్యులెవరు? మీ ఇద్దరిని నమ్ముకోడమే జర్నలిస్టులు చేసిన పాపమా?
మూడు రోజుల క్రితం కేసీఆర్ నిరాధార వార్త రాశారని మండిపడితే…ఆ తర్వాత రోజు ఆంధ్రజ్యోతి సంపాదకీయంలో రాసిన ఈ వాక్యాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. “ప్రభుత్వం చూడలేని వాటిని మీడియా చూస్తుంది, చూపిస్తుంది. అది ప్రజల కన్ను, ప్రజల అక్షరం”…మరి ఈ మాటలన్నీ ఎప్పుడేమయ్యాయి. ఉద్యోగాలను ఊడగొడితే వాళ్ల కష్టనష్టాలను చూసేదెవరు? చూపించేదెవరు? ప్రజల కన్నుగా ఉన్న వాళ్ల ఉపాధి కన్ను తీసేసే హక్కు ఎవరిచ్చారు?
జర్నలిస్టులంటే నమ్మకానికి, త్యాగానికి ప్రతీకలు. నిజంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి యజమానులు ఆర్థికంగా సంక్షోభంలో పడి ఉంటే ఆ విషయాన్ని ఉద్యోగులతో పంచుకుని ఉండాల్సింది. మీ కష్టనష్టాల్లో జర్నలిస్టులతో పాటు మిగిలిన డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు కూడా భాగం పంచుకునే వాళ్లు. ఆంధ్రజ్యోతితో పోల్చుకుంటే ఈనాడులో జీతాలు కొంచెం మెరుగే. తమ వేతనాల్లో స్వీయ కోతలు విధించుకుని తమ మీడియా సంస్థలకు పూర్వ వైభవం వచ్చేంత వరకు త్యాగాలకు సిద్ధపడే వారు. ఎందుకంటే వాళ్లు జర్నలిజాన్ని నమ్ముకుని వచ్చిన వాళ్లు కాబట్టి. ఆర్‌కే, రామోజీల జర్నలిజాన్ని అమ్ముకోడానికి వచ్చిన వాళ్లు కాదు కాబట్టి.
ఇక సాక్షి కూడా ఆంధ్రజ్యోతి, ఈనాడు మార్గంలోనే ప్రయాణిస్తుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. జగన్ అధికారంలోకి రావడానికి సాక్షి ఉద్యోగులు అనేక రాత్రులు నిద్రలేకుండా శ్రమించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్లు ఏ రకంగా చూసినా పెద్దగా ప్రయోజనం పొందింది లేదు. కనీసం ఈ విపత్తు వేళ వాళ్ల ఉద్యోగాలకైనా భద్రత కల్పిస్తే…అదే పెద్ద మేలు చేసిన వాళ్లవుతారు. అలా కాకుండా ఉద్యోగులను తొలగిస్తే మాత్రం వైఎస్ జగన్‌పై చిరస్థాయిగా ఓ మాయని మచ్చ మిగులుతుంది. ఈ విషయాన్ని గమనంలో పెట్టుకుని సాక్షి యాజమాన్యం నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు మంచిని, మానవత్వాన్ని పెంపొందించేలా ఉండాలి.