నా మాటే శాసనం..! అంటూ బాహుబలిలో తనదైన మార్కు ఉగ్ర నటనతో ఆకట్టుకున్నారు సీనియర్ నటి రమ్యకృష్ణ. మహారాణిగా రమ్య ఆహార్యం జాతీయ స్థాయిలో కనెక్టయ్యింది. నీలాంబరిగానూ `నరసింహ`లో రజనీకి సమానంగా నటించి అబ్బురపరిచిన రమ్యకృష్ణకు ఆ పాత్రే `బాహుబలి`లో శివగామి పాత్రని దక్కేలా చేసింది. ముందు ఈ పాత్ర కోసం జక్కన్న శ్రీదేవిని అనుకున్న ఆమె అనుచరగణం.. 15 మంది వ్యక్తగత సిబ్బందికి ఖర్చు చేయలేక ఆమెని పక్కన పెట్టి ఆ పాత్రని రమ్యకృష్ణ కు కట్టబెట్టారని కథనాలొచ్చాయి. ఆ తర్వాత శివగామి పాత్రను రమ్య మాత్రమే అద్భుతంగా ఆవిష్కరించగలరని బలంగా నమ్మి రాజమౌళి ఆఫర్ ఇచ్చారు.
ఆయన నమ్మకాన్ని నూటికి నూరు శాతం శివగామి పాత్రలో లీనమై నటించి రూజువు చేసింది రమ్యకృష్ణ. `సంకీర్తన`తో మొదలైన ఆమె విజయాల ప్రస్థానం ఇన్నేళ్లయినా అప్రతిహతంగా కొనసాగుతూనే వుంది. ప్రియురాలిగా.. ప్రతినాయకురాలిగా.. భార్యగా.. తల్లిగా.. భక్తురాలిగా.. అమ్మోరుగా ఇలా విభిన్నమైన పాత్రల్లో తనదైన మార్కు నటనని ప్రదర్శించి నటిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది.
వెండితెర శివగామిగా తన కీర్తిని విశ్వవ్యాప్తం చేసుకున్న రమ్యకృష్ణ తన 51వ పుట్టిన రోజు వేడుకల్ని ఇటీవల అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో రమ్య తన పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకున్నారు. ఈ వేడుకల్లో రాధిక- లిజీ- ఖుష్బూ -మధుబాల- త్రిష- రెజీనాలతో పాటు మరి కొంత మంది నటీనటులు హాజరయ్యారు. రమ్యకృష్ణ ప్రస్తుతం తెలుగులో సాయిధరమ్తేజ్తో `రిపబ్లిక్`.. కింగ్ నాగార్జునతో `బంగార్రాజు`… విజయ్ దేవరకొండతో `లైగర్` చిత్రాలతో పాటు భర్త కృష్ణవంశీ రూపొందిస్తున్న `రంగ మార్తాండ`లోనూ నటిస్తున్నారు.