‘వేటగాడు’లో దివాన్‌జీ అయిన రావు గోపాలరావుకు విలువైన హారం కావాలి. దానిని మెడలో వేసుకొని మారువేషంలో ఎన్.టి.ఆర్ వస్తాడు. ‘మా గురువు కల్లు కొండయ్య గారు’ అని నగేష్ ఎన్.టి.ఆర్ గురించి బిల్డప్ ఇస్తాడు. ఎన్.టి.ఆర్ ఊరికే ఉంటాడా? ‘ఏరా కుయ్యా’ అని రావు గోపాలరావును తిడతాడు. తిడితే పర్వాలేదు. ‘ఏవన్నాను’ అని ఆయన్నే రిపీట్ చేయమంటాడు. అప్పుడు రావుగోపాలరావు ‘ఏదో కుయ్యా అని చిన్న సౌండ్ ఇచ్చారండీ’ అంటాడు. ప్రేక్షకులు ఎంత నవ్వుతారో. ఆ సినిమాలోనే రావు గోపాలరావు ప్రాసతో ప్రాణాలు తీస్తుంటాడు. కొడుకైన సత్యనారాయణ విసిగిపోయి గుక్క తిప్పుకోకుండా ఎంత ప్రాస మాట్లాడతావో మాట్లాడు చూస్తాను అంటాడు. దానికి రావు గోపాలరావు చెప్పే డైలాగ్– ‘ఈస్టు స్టువర్టుపురం స్టేషనుమాస్టరు గారి ఫస్టు సన్ వెస్ట్‌కెళ్లి తనకిష్టమైన అతి కష్టమైన బారిష్టరు టెస్టులో ఫస్టు క్లాసులో బెస్టుగా పాసయ్యాడని తన నెక్స్ట్ ఇంటాయాన్ని ఫీస్టుకని గెస్టుగా పిలిస్తే ఆయన టేస్టీగా ఉన్న చికెను రోస్టుతో బెస్టు బెస్టు అంటూ తినేసి హోస్టుకు కూడా మిగల్చకుండా ఒక్కముక్క కూడా వేస్టు చేయకుండా సుష్ఠుగా భోంచేసి పేస్టు పెట్టి పళ్లు తోముకుని మరీ రెస్టు తీసుకున్నాడట ఏ రొస్టు లేకుండా. చాలా, ఇంకా వదలమంటావా భాషా బరాటాలు మాటల తూటాలు యతిప్రాసల పరోటాలు….. ’ ఇంకెక్కడి సత్యనారాయణ. పాయే.
రావు గోపాలరావు విలన్‌గా తెలుసు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుసు. కాని కామెడీని పండించే నటుడుగా వచ్చిన అవకాశాలను వదలుకోలేదటాయన. ‘ముత్యాల ముగ్గు’లో అంత సీరియస్ విలనే అయినా ‘డిక్కీలో పడుకోబెట్టేస్తానని’ ప్రేక్షకులు భయంభయంగానే అయినా నవ్వేలా చేశాడు. చిరంజీవి ‘మగ మహారాజు’లో రావు గోపాలరావు ఎప్పుడూ ఒక మరుగుజ్జు పిల్లాడిని చంకనేసుకొని దింపినప్పుడల్లా వాడు ఏడుస్తుంటే హైరానాపడుతూ తెగ నవ్విస్తాడు. ‘మా ఊళ్లో మహాశివుడు’ రావు గోపాలరావు ప్రతిభకు మచ్చుతునక. అందులో ఆయన శివుడుగా భూమ్మీదకు వచ్చి పూజారి అయిన సత్యనారాయణతో పాలిటిక్స్, కరప్షన్, ప్రత్యేకరాష్ట్ర ఉద్యమాల గురించి మాట్లాడుతూ నవ్విస్తాడు. శోభన్‌బాబు ‘దేవత’ సినిమాలో రావు గోపాలరావు జయప్రదకు వరుసకు బాబాయ్. కాని జయప్రదకు చెల్లెలు శ్రీదేవి పెళ్లి కానిదే తాను చేసుకోకూడదని ఉంటుంది. ఆ సంగతి తెలిసినా రావు గోపాలరావు శ్రీదేవితో జయప్రద పెళ్లి గురించి మాట్లాడుతుంటే సడన్‌గా జయప్రద వస్తుంది. ఆ సమయంలో కప్పిపుచ్చుకోవడానికి రావు గోపాలరావు చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది.
రావు గోపాలరావుతో జంధ్యాల ‘రావు గోపాలరావు’ సినిమా తీశాడు. అందులో ఆయనకు మతిమరుపు ప్రొఫెసర్ వేషం ఇచ్చాడు. కోడి రామకృష్ణ ‘తోడు దొంగలు’ సినిమాలో పూర్తి స్థాయి కామెడీ వేషం చేయించాడు. అందులో లాంచి గైడుగా రావు గోపాలరావు చాలా సందడి చేస్తాడు. ఇక రాజేంద్ర ప్రసాద్‌తో నటించిన ‘ఆఒక్కటీ అడక్కు’లో రొయ్యల నాయుడుగా కామెడీ పండిస్తాడాయన. చివరి రోజులలో ఆయన నాగార్జున ‘అల్లరి అల్లుడు’లో వాణిశ్రీ భర్తగా నటించారు. ‘ఏదో సామెత చెప్పినట్టు’ అనేది ఆయన ఊతపదం. ఆయన చెప్పే సామెతలు అసలు సామెతలేనా అని సందేహం వస్తుంటుంది. ‘ఇదెలా ఉందంటే చీర కట్టుకోవే చిలకమ్మా గుడికెళదాం అని గుండూరావంటే తొక్కతో సహా ఎప్పుడో తినేశాను అనందంట అనసూయమ్మ. అలా ఉంది వ్యవహారం’… ఇది ఆయన చెప్పే సామెత. 57 ఏళ్ల చిన్న వయసులోనే రావు గోపాల రావు మరణించారు. కాని ఆయన ఇదిగో ఇలాంటి పాత్రలతో ప్రేక్షకుల ముఖాలపై మందస్మితమై వెలుగుతుంటారు.