వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ లాక్ డౌన్ లో కూడా బిజీ బిజీగా గడిపాడు. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కలిపి ఆయన పది వరకు పూర్తి చేసినట్లుగా ఉన్నాడు. కొన్ని ఏటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తే కొన్ని థియేటర్ల ద్వారా విడుదలకు సిద్దం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వర్మ తన సినిమాలను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ‘కరోనా వైరస్’ సినిమాను ఈ నెల 11న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
కరోనా వైరస్ నేపథ్యంలో రాబోతున్న మొదటి సినిమా ఇదే అయ్యి ఉంటుంది అనడంలో సందేహం లేదు. మూడు నాలుగు నెలల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. థియేటర్లు లేకపోవడం వల్ల వర్మ సినిమా విడుదల వాయిదా వేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించాడు. థియేటర్లకు జనాలు వస్తారా రారా అనే విషయం వర్మకు అనవసరం అన్నట్లుగా ఉంది. అందుకే కేవలం ఆ ఒక్క సినిమా మాత్రమే కాకుండా తదుపరి వారం ‘మర్డర్’ ఆ తర్వాత ‘దిశ ఎన్ కౌంటర్’ ను విడుదల చేస్తానంటూ అధికారికంగా ప్రకటించాడు.
మిర్యాలగూడెంలో జరిగిన పరువు హత్య నేపథ్యంలో ‘మర్డర్’ సినిమాను రూపొందించిన విషయం తెల్సిందే. మర్డర్ సినిమాను విడుదల అవ్వనివ్వొద్దు అంటూ అమృత కోర్టుకు వెళ్లగా అక్కడ వర్మకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో సినిమా విడుదలకు రెడీ అవుతోంది. మర్డర్ 18వ తారీకున విడుదల కానుండగా దిశా రేప్ కేసుపై తీసిన ‘దిశా ఎన్ కౌంటర్’ మూవీని 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి వర్మ థియేటర్లు ఓపెన్ అవ్వడమే ఆలస్యం మూడు సినిమాలను విడుదల చేస్తున్నాడు. మరి ఈ సినిమాలను చూసేందుకు జనాలు ఏమేరకు థియేటర్లకు వస్తారో చూడాలి.