రామ్ గోపాల్ వర్మని చాలామంది పరాన్న జీవిగా అభివరణిస్తారు. అదెంత నిజం.? అన్నది వేరే చర్చ. 2014 నుంచి 2019 వరకూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా ఆర్జీవీ వేసిన వేషాలు అన్నీ ఇన్నీ కావు. వైసీపీ కనుసన్నల్లోనే ఆర్జీవీ చాలా చాలా చేశాడు, చేస్తూనే వున్నాడు.
అసలు సినీ పరిశ్రమ గురించి ఏనాడూ బాధ్యతగా వర్మ ఆలోచించింది లేదు. సమాజం పట్ల తనకు బాధ్యత లేదని చెబుతుంటాడాయన. అలాంటి వర్మ, ఈ రోజు తెలుగు సినీ పరిశ్రమ తరఫున వకాల్తా పుచ్చుకుని, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేస్తున్నాడంటే నమ్మేదెలా.?
వైసీపీ డైరెక్షన్‌లో వర్మ కేవలం నటిస్తున్నాడంతే. ఈ మొత్తం కథను వైసీపీ పెద్దలు నడిపిస్తున్నారు. అందులో మంత్రి పేర్ని నాని అయినా, ఇంకో మంత్రి కొడాలి నాని అయినా కేవలం పాత్రధారులు మాత్రమేనన్న చర్చ జర్వత్రా జరుగుతోంది.
‘వర్మని నమ్మొద్దు బ్రో..’ అంటూ సోషల్ మీడియా వేదికగా చాలామంది తమ అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టేస్తున్నారు, సాటి నెటిజన్లను అప్రమత్తం చేస్తున్నారు. పవన్ అభిమానుల ముసుగులో, ప్రభాస్ అభిమానుల ముసుగులో.. వర్మకి మద్దతుగా బోల్డన్ని ట్వీట్లు పడుతున్నా, అవన్నీ వైసీపీ సానుభూతిపరుల ట్వీట్లుగానే అందరూ పరిగణిస్తున్నారు.
నిజానికి, వర్మ ప్రశ్నల్లో కొన్ని చిత్తశుద్ధితో సంధించిన ప్రశ్నలుగానే కనిపిస్తున్నా, వర్మని నమ్మడానికి వీల్లేదన్నదే మెజార్టీ అభిప్రాయం. ‘నేనూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా అభిమానిస్తాను..’ అంటూ వర్మ తాజాగా ఓ బాంబు పేల్చాడు. సో, మంత్రి పేర్ని నానికి సోషల్ మీడియా వేదికగా ఇప్పటిదాకా వర్మ ఇచ్చిన కౌంటర్ ఎటాక్ అర్థం లేనిదన్నమాట.
వర్మ ఎన్ని వేషాలు వేసినా, పరిశ్రమ పెద్దరికం ఆయనకు దక్కదు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. వర్మ బూతు సినిమాలు తీస్తాడంటూ, వైసీపీ పెంచి పోషిస్తోన్న ఓ సీనియర్ జర్నలిస్టు యూ ట్యూబ్ ద్వారా విశ్లేషించి ఏకిపారేసినా.. ఇదంతా బులుగు నాటకంలో భాగమే.
పెద్ద సినిమాలు పూర్తిగా సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నాక, ఒమిక్రాన్ నేపథ్యంలో సినిమా థియేటర్ల వైపు జనం వెళ్ళాలంటే భయపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వర్మ లొల్లి, వైసీపీ హంగామా.. ఇదంతా ‘డ్రామా’ కాకపోతే ఇంకేమనుకోవాలి.?