ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో అన్ని భాషల సినిమా పరిశ్రమపై తీవ్రప్రభావం పడినది. హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అన్ని సినిమాలు కూడా వాయిదాలు పడుతున్నాయి. ఇక టాలీవుడ్ సినిమాల పరిస్థితి కూడా అలాగే ఉంది. పెద్ద సినిమాలు చిన్న సినిమాలు ప్రతి ఒక్కటి కూడా వాయిదా పడినవి. ఈ ఏడాదిలో పెద్ద సినిమాలు వచ్చే అవకాశమే కనిపించడం లేదు. ఓవర్సీస్ లో తెలుగు సినిమాలకు మంచి బిజినెస్ అయ్యేది. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా వంటి దేశాల్లో సినిమాలు విడుదల అవ్వడమే గగనంగా మారింది.
అమెరికాలో పరిస్థితులు కుదుటపడి అంతటా కూడా సినిమా విడుదల అయ్యే సమయం వరకు పెద్ద సినిమాలు వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నారు. బాహుబలి సినిమా ఓవర్సీస్ లో రాబట్టిన వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 10 మిలియన్‌ల డాలర్లను మించి బాహుబలి రాబట్టింది. ఇక ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం కూడా 15 నుండి 20 మిలియన్‌ల డాలర్ల వరకు రాబట్టే అవకాశం ఉందని నమ్మకంగా మేకర్స్ ఉన్నారు.
ఓవర్సీస్‌లో పరిస్థితులు కుదుటపడకుండానే సినిమాను విడుదల చేస్తే అక్కడ భారీ గండిపడే ప్రమాదం ఉంది. అందుకే సినిమాను హడావుడి లేకుండా అంతటా కూడా కరోనా అదుపులోకి వచ్చిన తర్వాత వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రమే సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. చిత్ర యూనిట్‌కు చెందిన ఒక సభ్యుడు ఈ విషయంను చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది చివరి వరకు సినిమా రెడీ అవ్వనుంది. కాని విడుదల తేదీని మాత్రం చెప్పలేమని అంటున్నాడు.