మోస్ట్ అవేయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులే కాకుండా తెలుగు.. ఇతర భాషల సినీ ప్రేక్షకులు కూడా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. దాదాపు సినిమా షూటింగ్ మొత్తాన్ని జక్కన్న ఫినిష్ చేశాడు. కేవలం రెండు పాటల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉండగా.. అందు కోసం చిత్ర బృందం ఉక్రెయిన్ వెళ్లింది. ఈ రెండు పాటలను దాదాపు వారం పది రోజుల పాటు షూట్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలయిన అన్ని అప్డేట్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూ సినిమాపై హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.
ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 13 న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అప్పటి వరకు కోవిడ్ పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్లు భారీ స్థాయిలో ప్రారంభమయ్యాయి. కాబట్టి రాబోయే రోజుల్లో సినిమాకు సంబంధించి కొన్ని పెద్ద ఫంక్షన్లను మనం ఆశించవచ్చు. చిన్న చిన్న చిత్రాల దర్శక నిర్మాతలే కోట్లు ఖర్చు పెట్టి రిలీజ్ ఈవెంట్లు చేస్తున్న ఈ తరుణంలో ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద సినిమాకు ఫంక్షన్లను ఆశించడంలో ఏ మాత్రం తప్పు లేదు. కానీ ఫిల్మ్ నగర్ లో మాత్రం వేరేలా ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి రిలీజ్ ఈవెంట్లు ఆడియో ఫంక్షన్ల లాంటివి ఉండవని జోరుగా ప్రచారం నడుస్తోంది. కేవలం రాజమౌళి స్టైల్ లో కొన్ని టీవీ చానెళ్లలో ఈవెంట్ లు ఉంటాయని తెలుస్తోంది. ఇందుకు కూడా కారణం లేకపోలేదని అందరూ అనుకుంటున్నారు. కరోనా భయందోళనల నేపథ్యంలోనే ఎటువంటి బహిరంగ ఫంక్షన్లు చేయకూడదని మూవీ టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జనాలు ఒక్క చోట గుమిగూడే లా ఫంక్షన్లు చేస్తే మరలా ఎవరికైనా ఏమైనా అయితే మూవీకి బ్యాడ్ నేమ్ వస్తుందని వారు ఆలోచిస్తున్నట్లు సమాచారం. బాహుబలి ప్రమోషన్ కార్యక్రమాలను ఏ రేంజ్ లో నిర్వహించారో తెల్సిందే.
రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ వద్ద భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో బాహుబలి వేడుక జరిగింది. ఆర్ ఆర్ ఆర్ వేడుక అంతకు మించి జరుగుతుందని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా చిత్ర యూనిట్ సభ్యులు కరోనా కారణంగా ప్రీ రిలీజ్ వేడుక రద్దు చేశారని సమాచారం అందుతోంది. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా జక్కన్న వ్యవహరిస్తారు కనుక ఆయన ఈ వేడుకలు నిర్వహించక పోవచ్చు అనే ఎక్కువ శాతం మంది అనుకుంటున్నారు. ఆ విషయమై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.