రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. భారతీయ సినీ తెరపై మునుపెన్నడూ కనీ వినీ ఎరుగని కథా కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రం యావత్ ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంది. ప్రీ ఇండిపెండెంట్ ఎరా నేపథ్యంలో ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన ఇద్దరు లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు కొమరం భీం ల ఫిక్షనల్ స్టోరీ నేపథ్యంలో అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని రాజమౌళి తెరకెక్కించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ కావడం `బాహుబలి` వంటి చరిత్రని తిరగరాసిన సినిమా తరువాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో సహజంగానే ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి సందర్భంగా ఏడు రోజుల ముందే అంటే జనవరి 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇందు కోసం రాజమౌళి ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలని డిజైన్ చేశారు.
దాదాపు 20 కోట్లు ఖర్చు చేశారు కూడా. బాలీవుడ్ లో వారం రోజుల పాటు మకాం పెట్టి అక్కడి మీడియాలకు వరుస ఇంటర్వ్యూలు కపిల్ శర్మ షో.. ప్రో కబడ్డీ గేమ్ లైవ్ ఈవెంట్ లోనూ పాల్గొని సినిమాకు ప్రచారం చేశారు. అయితే రిలీజ్ డేట్ మారడంతో మళ్లీ ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి. ఇలా ఈ మధ్య కాలంలో ఏ భారీ చిత్రానికి జరగలేదు. ఇది నిజంగా `ఆర్ ఆర్ ఆర్` మేకర్స్ కి అదనపు భారంగా మారబోతోంది.
తాజా రిలీజ్ డేట్ ప్రకారం `ఆర్ ఆర్ ఆర్` మార్చి 25న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. ఇది ఫైనల్ డేట్. ఈ డేట్ లో ఎలాంటి మార్పు వుండదు. ఒక వేళ పరిస్థితులు మళ్లీ దారుణ స్థాయికి వెళ్లితే తప్ప `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు వుండదు. ఈ నేపథ్యంలో మూవీ ప్రచారం కోసం మళ్లీ ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించబోతున్నారు. ఇందు కోసం జక్కన్న ఓ స్పెషల్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
మార్చి సెకండ్ వీక్ నుంచి మళ్లీ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో స్పెషల్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. అయితే అది ఇండియాలో మాత్రం కాదండోయ్ యుఎస్ లో అని తెలిసింది. అక్కడ లభించే పర్మీషన్ ని బట్టి భారీ ఈవెంట్ ని ఏర్పాటు చేయాలన్నది రాజమౌళి ఆలోచనగా తెలుస్తోంది. ఈ సారి జక్కన్న ఏ రేంజ్లో ప్రచారాన్ని ప్లాన్ చేశాడన్నది తెలియాలంటే వచ్చే నెల ఫస్ట్ వీక్ వరకు వేచి చూడాల్సిందే.