‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి అంతా సిద్ధమైంది. పాన్ ఇండియా స్థాయిలో పలు ప్రధాన భారతీయ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించగా.. అలియా భట్ – అజయ్ దేవగన్ వంటి బాలీవుడ్ స్టార్స్ కూడా భాగమయ్యారు.
దాదాపు 450 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు నిర్మాత డీవీవీ దానయ్య. జక్కన్న పేరు చెప్పుకొని ప్రీ రిలీజ్ డీల్స్ బాగానే చేసుకోగలిగారు. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే భారీ ఓపెనింగ్స్ గ్యారంటీ అనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో RRR టికెట్ రేట్లు పెంచుకోడానికి ప్రభుత్వాలు అవకాశం కల్పించాయి కాబట్టి.. ఫస్ట్ డే కుంచెం అటుఇటుగా యాభై కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
యూఎస్ లో 2.5 మిలియన్ల డాలర్లకు పైగా ప్రీ సేల్స్ రావడాన్ని బట్టి చూస్తే.. ఓవర్ సీస్ లో బీభత్సమైన కలెక్షన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు పెట్టాలంటే నార్త్ మార్కెట్ చాలా కీలకమనే చెప్పాలి.
ఈ నేపథ్యంలో RRR టీమ్ ఉత్తరాదిలో ప్రమోషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ముంబైలో స్పెషల్ ఈవెంట్ చేయడంతో పాటుగా ఢిల్లీ – అమృత్ సర్ – బరోడా – వారణాసి – జైపూర్ – కోల్ కటా వంటి ప్రధాన నగరాల్లో పర్యటించి వచ్చారు.
దీంతో నార్త్ మార్కెట్ నుండి మొదటి రోజు 20 నుండి 25 కోట్లు ఆశిస్తున్నారు. అయితే హిందీలో ‘రాధే శ్యామ్’ మాదిరిగానే RRR యొక్క ప్రీ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. అక్కడక్కడ తెలుగు వెర్షన్ ప్రదర్శించే థియేటర్లు ఫుల్ అవుతున్నాయి కానీ.. హిందీ బుకింగ్స్ మాత్రం ఆశాజనకంగా లేవు.
‘బాహుబలి’ సినిమా తర్వాత రాజమౌళి నుంచి వస్తోన్న సినిమా కావడంతో.. ఆయన క్రేజ్ తో అన్ని షోలు అడ్వాన్స్ గా హౌస్ ఫుల్ అవుతాయని అందరూ భావించారు. అయితే ప్రమోషన్స్ తో సోషల్ మీడియాలో హడావిడి కనిపిస్తోంది కానీ.. ఆ స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి రిలీజ్ కు ముందు రోజైనా బుకింగ్స్ పెరుగుతాయేమో చూడాలి.
ఏమైనప్పటికీ ఉత్తరాది మార్కెట్ లో RRR సినిమా తొలిరోజు 8 నుంచి 10 కోట్లు రాబట్టవచ్చని బాలీవుడ్ ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. టాక్ బాగుంటే రెండో రోజు నుంచి మరింతగా పుంజుకునే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.