వరుస డిజాస్టర్లతో తెగ సతమతమైపోయిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్‌కు ‘చిత్రలహరి’, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలతో మంచి రిలీఫ్ దొరికింది. ఈ రిలీఫ్‌లోనే తేజూ ఓ నిర్ణయం తీసుకున్నాడట. అదేంటంటే… మామ మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లోని సూపర్ హిట్ పాటలను వాడుకోవడం ఈ మెగా మేనల్లుడికి ఓ సెంటిమెంట్. అయితే ఇకపై ఆ పని చేయనంటున్నాడు తేజు.
మొదటి సినిమా ‘రేయ్’ కోసం ‘గోలిమార్’ పాటను రీమిక్స్ చేసిన సాయిధరమ్ తేజ్, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’, ‘ఇంటెలిజెంట్’ సినిమాల్లో మెగాస్టార్ క్లాసిక్ సాంగ్స్‌నే రీమిక్స్ చేసి స్టెప్పులు వేశాడు. మొదట మెగాస్టార్ పాటలకు సాయిధరమ్ తేజ్ అచ్చు అలాగే స్టెప్పులు వేయడం చూసి, మెగా ఫ్యాన్స్ ముచ్ఛటపడ్డారు. అయితే అదే సీన్ మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుండడంతో రిజల్ట్ తేడా కొట్టింది.
మెగాస్టార్ క్లాసిక్ సాంగ్స్‌ను రీమిక్స్ చేసి పాడుచేస్తున్నారంటూ మెగా ఫ్యాన్స్ నుంచి గట్టిగా విమర్శలు వచ్చాయి. అదీగాక ‘సుప్రీమ్’ వంటి కెరీర్ బెస్ట్ హిట్టు కొట్టిన తర్వాత ఏకంగా డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్స్‌ని చూశాడు ఈ సుప్రీమ్ హీరో. ఒకానొక దశలో డీప్ డిప్రెషన్‌లోకి వెళ్లిన తేజు, ఇలాగోలా మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. దాంతో ఇకపై డైరెక్టర్ పట్టుబట్టి మరీ చెబితే తప్ప, ఇలాంటి పాటల రీమిక్స్ జోలికి వెళ్లకూడదని డిసైడ్ అయ్యాడట.
ప్రస్తుతం చేస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలో గానీ, ఆ తర్వాత దేవకట్టా దర్శకత్వంలో చేసే మూవీలో గానీ రీమిక్స్ సాంగ్స్ ఉండవని చెప్పాడు సుప్రీం హీరో.