దక్షిణాది అందాల తార సాయి పల్లవిలో ఆగ్రహం కట్టలు తెంచుకొంది. గతంలో ఎప్పుడూ ఆమె ఈ స్థాయిలో రియాక్ట్ కాలేదు. కానీ ఓ ఏడేళ్ల చిన్నారి మరణం ఆమెని కదిలించింది, కన్నీరు పెట్టించింది. తమిళనాడులో ఏడేళ్ల చిన్నారి జయప్రియను అత్యంత అమానవీయంగా ప్రాణాలు తీయడం యావత్ దేశాన్ని కదిలించివేసింది.
దీనిపై సాయిపల్లవి కూడా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తమిళనాడులోని పుదుకొట్టాయ్ జిల్లా ఎంబాల్ గ్రామానికి చెందిన జయప్రియ రెండో తరగతి విద్యార్థిని. ఈ నెల ఒకటిన బుధవారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ అదృశ్యమైంది. ఆంగోళనకు గురైన తల్లిదండ్రులు బిడ్డ కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి గ్రామ పొలిమేరల్లో ముళ్లపోదల్లో విగతజీవిగా పడి ఉన్న ఏడేళ్ల చిన్నారిని పోలీసులు గుర్తించారు. పాపపై అత్యాచారం అనంతరం హత్యకు పాల్పడినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది.
ఈ దుర్ఘటనపై తమిళనాట ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. #JusticeForJayapriya అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో హోరెత్తిస్తూ ఆమెకి న్యాయం చేయాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు
ఈ నేపథ్యంలో దక్షిణాది బ్యూటీ సాయి పల్లవి తనదైన శైలిలో స్పందించారు. మానవజాతిపై విశ్వాసం నశిస్తోందన్నారు. మనలోని క్రూరత్వాన్ని సంతృప్తి పరచడానికి పిల్లలను చంపుతున్నారని సాయి పల్లవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆమె ఘాటుగా తన గుండెల్లో గూడు కట్టుకున్న స్పందనను వెల్లడించారు.
‘మానవజాతిని పూర్తిగా తుడిచిపెట్టాల్సిన అవసరం ఉందని ప్రకృతి హెచ్చరిస్తున్నట్టుగా ఉంది. అలాంటి దారుణ ఘటనలు చూడానికి ఇలాంటి దారుణమైన జీవితాన్ని గడుపుతున్నాం.. ఈ అమానవీయ ప్రపంచానికి మరో బిడ్డకు జన్మనివ్వడానికి అర్హత లేదు. అలాంటి రోజు రాకూడదు. గుర్తించని, రిపోర్ట్ చేయలేని నేరాల విషయంలో ఏం జరుగుతోందో? ప్రతీ చోట ఇలాంటి దారుణాలు జరుగుతున్న విషయాలు తెలియజెప్పేందుకు హ్యాష్ ట్యాగ్‌లు పెట్టాల్సి వస్తోంది’ అని నిరసనతో కూడా ఆవేదన వ్యక్తం చేశారామె.
చివరగా ఈ ఆవేదన అంతా ఏడేళ్ల బాలికకు జరిగిన అన్యాయంపై అని చెప్పడానికి #JusticeforJayapriya అనే హ్యాష్ ట్యాగ్‌ను సాయి పల్లవి జత చేశారు. ఆమె స్పందన హృదయాంతరాల్లోంచి తన్నుకు రావడాన్ని స్పష్టంగా చూడొచ్చు.