తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి.. మేటి కథానాయిక జయలలిత జీవిత కథ ఆధారంగా ఏ.ఎల్ విజయ్ `తలైవి` చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. జయలలిత పాత్రలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించారు. ఆ పాత్ర కోసం కంగన ఎంతో శ్రమించారు. జయలలితగా రకరకాల దశలకు సంబంధించిన ఆహార్యంతో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేందుకు కంగన చాలా సాహసాలే చేసారు. కథానాయికగా.. రాజకీయనాయకురాలిగా.. ముఖ్యమంత్రిగా జయలలిత లైఫ్ జర్నీ గురించి తెలిసినదే. నాయకురాలిగా తమిళనాడు ప్రజలకు జయలలిత ఎన్నో గొప్ప సేవలు అందించారు. ఇక సినిమాల్ని వదిలి పూర్తిగా రాజకీయ నాయకురాలిగా మారిన తరుణంలో ఆమెలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కట్టు..బొట్టు…మాట్లాడే విధానం అన్నింటి జయలలిత మార్పులు తీసుకొచ్చారు.
ఈ నేపథ్యంలో ఆమె ఎక్కువగా కాంచీపురం చీరలనే ధరించేవారు. నాయకురాలిగా సమావేశాలకు హాజరవ్వాలంటే కచ్చితంగా కాంచీపురం చీరలే ధరించి వెళ్లేవారు. ఆ చీరల ఔన్నత్యాన్ని ఆ రకంగా జయలలిత చాటి చెప్పేవారు. సినిమాలోనూ వాస్తవికతను ఎక్కడా మిస్ అవ్వకుండా కంగన పాత్రకు కాంచీపురం చీరలనే వాడినట్లు యూనిట్ తెలిపింది. కథ ఆమె జీవితానికి ఎంత దగ్గరగా ఉంటుందో అందులో పాత్రలు.. వేషధారణ కూడా అంతే వాస్తవంగా ఉండేలా జాగ్రత్తపడినట్లు తెలిపారు. తాజాగా జయలలిత మెచ్చిన స్పెషల్ `కాంచీపురం` చీరల్ని అక్కినేని కోడలు సమంతకు తలైవి నిర్మాతలు కానుకగా పంపించారు.
గోల్డ్ కలర్ బాక్స్ లో కాంచీపురం ఎరుపు వర్ణం చీరల్ని ప్యాక్ చేసి నేరుగా ఇంటికి పంపించారు. ఆ చీరలతో పాటు జయలలిత జీవితంలో కాంచీపురం చీర ప్రాముఖ్యతను వివరిస్తూ ఓ లేఖ కూడా ఉంది. అవి చూసిన సమంత థ్రిల్ ఫిలై భావోద్వేగానికి గురయ్యారు. తలైవి చిత్రాన్ని చూడటం కోసం సెప్టెంబర్ 10వ తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సమంత తెలిపారు.