‘ప్రస్థానం’ సినిమా అప్పటికి సరిగా ఆడలేదు కానీ.. అది తెలుగులో వచ్చిన అత్యుత్తమ పొలిటికల్ డ్రామాల్లో ఒకటనడంలో సందేహం లేదు. దేవా కట్టా రూపొందించిన ఈ చిత్రంలో ఓవైపు శర్వానంద్, మరోవైపు సాయికుమార్ అద్భుతంగా నటించి మెప్పించారు.
అలాంటి నటుల మధ్య ఓ కొత్త నటుడు తన ఉనికిని చాటుకోవడమే కాదు.. వావ్ అనిపించాడు. అతనే సందీప్ కిషన్. ఇందులో నెగెటివ్ రోల్‌లో సందీప్ ఎంత బాగా ఒదిగిపోయాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హీరో పాత్రలతోనూ రాని పేరు.. ఆ క్యారెక్టర్‌తో సంపాదించాడు సందీ
ప్. తొలి సినిమాలోనే బాగా అలవాటైన నటుడిలా నటించడం సందీప్‌కు ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఆ సినిమాతో మొదలుపెట్టి.. ఆ తర్వాత ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో హీరోగా మారి తనకంటూ ఓ స్థాయిని అందుకున్నాడు సందీప్. ఇప్పుడు సందీప్ పదేళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం విశేషం.
ఈ సందర్భంగా దేవా కట్టా సందీప్‌ను విష్ చేస్తూ అతను ‘ప్రస్థానం’ సినిమాలోకి ఎలా వచ్చాడో వివరించాడు. ముందు అసలు ‘ప్రస్థానం’లో సందీప్ భాగమే కాదని అతను వెల్లడించాడు. అతను చేసిన పాత్ర కోసం వేరొకరని అనుకున్నట్లు తెలిపాడు.
అమెరికాకు చెందిన ఆ వ్యక్తి వ్యక్తిగత కారణాలతో ఈ సినిమా నుంచి చివరి దశలో తప్పుకోవాల్సి వచ్చిందని.. అప్పటికి షూటింగ్ మొదలుపెట్టడానికి రెండు వారాలు మాత్రమే మిగిలుందని.. దీంతో ముఖ్యమైన ఈ పాత్ర కోసం ఎవరిని ఎంచుకోవాలో తెలియని అయోమయంలో తాము ఉన్నామని చెప్పాడు.
అలాంటి సమయంలో శర్వానంద్.. సందీప్‌ను పరిచయం చేశాడని.. ఆడిషన్స్ నిర్వహించగా కొద్ది సేపట్లోనే ఈ పాత్రకు అతనే సరైన వాడని అర్థమైందని.. షూటింగ్ టైంలో పాత్రకు ఎలా మెరుగులు దిద్దాలి.. ఇంకా ఏం చేయొచ్చు అని ఒక దర్శకుడి తరహాలో ఆలోచిస్తూ తనను తాను మౌల్డ్ చేసుకుని నటించి తన మీద సందీప్ భారం తగ్గించాడని దేవా అతణ్ని కొనియాడాడు.