రాజకీయ నాయకుడు సహాయం చేస్తున్నాడంటే కచ్చితంగా తన ఓటరా కాదా అని ఆలోచిస్తాడు, పోనీ తన పార్టీయా లేక తన నియోజకవర్గమేనా కాదా అనే విషయాన్నయినా ఎంక్వయిరీ చేస్తాడు. అయితే రాజకీయ నాయకులంతా లాక్ డౌన్ వేళ ఇలాంటి పట్టింపులకు పోలేదు. స్థానికంగా ఉన్న పేదలు, వలస కూలీల కడుపునింపారు. దాదాపు అందరూ ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేశారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే సీతక్క రియల్ లాక్ డౌన్ హీరోగా నిలిచారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్షాలకు చెందిన ఎంతోమంది నేతలు సహాయక కార్యక్రమాలు చేపట్టినా వారందర్నీ వెనక్కు నెట్టారు ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్ సీతక్క. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు కిలోమీటర్ల మేర నడచి వెళ్లి వారికి నిత్యావసరాలు అందించిన ఆమె సాహసం, సంకల్పం అందరి కంటే ఎంతో గొప్పది. దీనికంటే గొప్ప విషయం ఇంకోటి ఉంది. సీతక్క తెలంగాణ బోర్డర్ దాటి, ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి అక్కడ కూడా తన సేవాభావం చాటుకున్నారు.
తన ఓటర్లు కాదు, తన నియోజకవర్గం కాదు, కనీసం తన రాష్ట్రం కూడా కాదు. అయినా సరే లాంచీలో వెళ్లి, గిరిజన తండాలకు ఓపిగ్గా నడుచుకుంటూ వెళ్లి వారికి అండగా నిలిచారు సీతక్క. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణ నుంచి కొన్ని మండలాలు ఏపీలో కలిశాయి. ఆ సమయంలో వారి ఆలనా పాలనా చూసేవారు కరవయ్యారు. విభజనకు ముందు జరిగిన ఎన్నికల్లో వారు ఓటు వేసింది ఒకరికి, రాష్ట్రం విడిపోయిన తర్వాత వారి నియోజకవర్గం మరొకటి.
ఇలా అటు ఆ ఎమ్మెల్యే పట్టించుకోక, ఇటు ఈ ఎమ్మెల్యే పట్టించుకోక అవస్థలు పడ్డారు ప్రజలు. అలాంటిది.. తన నియోజకవర్గం కాకపోయినా పేదల కోసం కిలోమీటర్ల మేర నడుచుకుంటూ, నిత్యావసరాలు మోసుకెళ్లి మరీ ఇచ్చారంటే ఆమె సేవను కొనియాడకుండా ఉండలేం.
ఆకలిని తరిమేద్దాం అనే నినాదంతో కరోనా టైమ్ లో వరుసగా 60 రోజుల పాటు ఆమె ప్రజలవద్దకు వెళ్లి కూరగాయలు, సరుకులు అందించారు. లాక్ డౌన్ టైమ్ లో నిజమైన ప్రజా నాయకురాలు అనిపించుకున్నారు.