టాలీవుడ్ యువ కథానాయకుల్లో శర్వానంద్‌ది ప్రత్యేకమైన శైలి. అతను ఏదో ఒక తరహా సినిమాలకు ఎప్పుడూ పరిమితం కాలేదు. ‘ప్రస్థానం’ లాంటి ఇంటెన్స్ మూవీ చేశాడు. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘మహానుభావుడు’ లాంటి ఎంటర్టైనర్‌గా మెప్పించాడు. ‘శతమానం భవతి’ లాంటి ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తోనూ ఆకట్టుకున్నాడు. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ గాఢమైన ప్రేమకథతోనూ ఇంప్రెస్ చేశాడు.
ఎప్పటికప్పుడు అతను వైవిధ్యమైన సినిమాలతోనే సాగిపోతుంటాడు. కరోనా లేకుంటే అతడి కొత్త చిత్రం ‘శ్రీకారం’ ఈపాటికి విడుదలయ్యేది. ఆ సినిమా చివరి దశలో ఉండగా.. కొత్తగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ సినిమాను ఓకే చేశాడు శర్వా. అతను హీరోగా ఇంకో రెండు ప్రాజెక్టులు కూడా ఖరారైనట్లు వార్తలొస్తున్నాయి.
శర్వా ఓకే చేసిన కొత్త ప్రాజెక్టుల్లో ఒకటి ప్రకాష్ అనే నూతన దర్శకుడితో అని సమాచారం. అది శర్వా ఇంతకుముందు చేయని ఓ వైవిధ్యమైన కథతో తెరకెక్కనుందట. ఇందులో శర్వానంద్ వికలాంగుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. శర్వా లాంటి హ్యాండ్సమ్ హీరో.. వికలాంగుడిగా నటించడం అంటే సాహసమనే చెప్పాలి. ఇలాంటి పాత్రలు తమిళంలో వర్కవుట్ అవుతాయి కానీ.. తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చెప్పలేం.
శర్వా అంత రిస్క్ చేస్తున్నాడంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది. ఈ చిత్రానికి ఇంకా నిర్మాత ఖరారవ్వలేదు. శర్వానే నిర్మాతను వెతికే పనిలో ఉన్నాడట. మరోవైపు శర్వా చాలా ఏళ్ల విరామం తర్వాత మళ్లీ కోలీవుడ్లోకి వెళ్లనున్నట్లు సమాచారం. అతను కొరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ రాజు సుందరంతో ఓ సినిమా చేయబోతున్నాడు. ‘ఎంగేయుం ఎప్పోదుం’ (తెలుగులో జర్నీ) తర్వాత తమిళంలో శర్వా చేయనున్న సినిమా ఇది. దీన్ని తెలుగులోకి కూడా అనువదిస్తారు.