ఆర్‌ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న అజయ్ భూపతి కమర్షియల్‌గా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత వెంటనే మహాసముద్రం సినిమాను చేయాలనుకున్నాడు. కథ నచ్చినా కూడా ఇద్దరు హీరోల కథ అవ్వడంతో చాలా మంది వెనక్కు తగ్గారు. చివరకు శర్వానంద్ మహా సముద్రం సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే మరో హీరో ఎవరు అనే విషయంలో అనేక వార్తలు వచ్చాయి. బొమ్మరిల్లు సిద్దు ఈ సినిమాలో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.
మహాసముద్రం సినిమాను నిర్మిస్తున్న ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నేడు ఉదయం ఆ విషయంపై క్లారిటీ ఇచ్చింది. తమ సినిమాతో సిద్దార్థ టాలీవుడ్ కు కమ్ బ్యాక్ ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు. సిద్దు తెలుగులో ఒక సెన్షేషన్ క్రియేట్ చేశాడు. బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఆట ఇలా పలు సినిమాలతో యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. కాని కొన్ని సినిమాల ఫలితాలు తారు మారు అవ్వడంతో తెలుగు ప్రేక్షకులు ఈయన్ను మరిచి పోయే పరిస్థితి వచ్చింది. తమిళంలో సినిమాలు నటిస్తున్నా కూడా తెలుగులో ఆయన సినిమాలు డబ్బింగ్ అవుతున్నా కూడా పెద్దగా పట్టించుకోలేదు.
ఇన్నాళ్లకు తెలుగులో సిద్దార్థ నటిస్తున్న కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. మహాసముద్రం సినిమా ను వచ్చే నెలలో సెట్స్ పైకి తీసుకు వెళ్లి వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. శర్వానంద్ కు ఈ సినిమా సక్సెస్ చాలా కీలకం. అలాగే సిద్దుకు కూడా ఈ సినిమా సక్సెస్ అవసరం. ఈ సినిమా సక్సెస్ అయితే సిద్దు మళ్లీ తెలుగులో బిజీ అవుతారని అంతా నమ్మకంగా ఉంది.