ఈమద్య కాలంలో వలస కూలీలు అనగానే అందరికి కూడా నటుడు సోనూ సూద్ పేరు గుర్తుకు వస్తుంది. వందలాది మంది వలస కార్మికులను తిండి పెట్టి మరీ సొంత ప్రాంతాలకు పంపించిన ఘనత ఆయనకే దక్కింది. మహిళ కార్మికుల కోసం ఏకంగా విమానంను బుక్ చేసి తన మంచితనంను చాటుకున్న సోనూసూద్ ఇంకా కూడా వలస కార్మికులను వారి వారి ప్రాంతాలకు తరలిస్తూనే ఉన్నాడు. ఇటీవల మద్యప్రదేశ్‌కు చెందిన ఒక బీజేపీ సీనియర్ నాయకుడు మహారాష్ట్రలోని ముంబయిలో ఉన్న తమ వారిని పంపించాలంటూ విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశాడు.
ముంబయిలో చిక్కుకు పోయిన వలస కార్మికుల జాబితాను ఇవ్వడంతో పాటు, వారు ఎక్కడ ఉన్నారు ఎక్కడకు వెళ్లాలి అనే విషయాలను కూడా తెలియజేస్తూ బీజేపీ నాయకుడు రాజేంద్ర శుక్లా ట్వీట్ చేశాడు. ఆయన ట్వీట్‌కు స్పందించిన సోనూసూద్ తప్పకుండా వారికి సాయం చేస్తాను. త్వరలోనే వారు మహారాష్ట్ర చేరుకునేలా ఏర్పాట్లు చేస్తానంటూ హామీ ఇచ్చాడు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా నెటిజన్స్ రాజేంద్ర శుక్లాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఒక జాతీయ పార్టీ నాయకుడివి, అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకుడివి అయ్యి ఉండి వలస కార్మికుల విషయంలో సోనూసూద్ సాయం అడిగేందుకు సిగ్గుగా అనిపించడం లేదా. మీరు తల్చుకుంటే వలస కార్మికులందరి సమస్యలకు పరిష్కారం చూపించగలరు. మీ వద్ద ఆర్థిక పరమైన వనరులు ఉన్నారు, అధికారం ఉన్నా కూడా మీరు మాత్రం ఏం పట్టించుకోరు. సోనూ సూద్ లాంటి వారు సాయం చేసేందుకు ముందుకు వస్తే ఆయనకు ఈ కార్యక్రమం బదలాయించి చేతులు దులిపేసుకుంటావా అంటూ ఎద్దేవ చేశారు.