దేశంలో కరోనా వైరస్ విజృంభణ గురించి తెలిసిందే. అయితే.. కరోనా, లాక్ డౌన్ సమయంలో రీల్ లైఫ్ లో విలన్.. రియల్ లైఫ్ లో హీరో అయ్యాడు. అతనే ‘సోనూసూద్’. ఉపాధి కోల్పోయిన వలస కార్మికులను ఆదుకోవడం దగ్గర నుంచి ప్రారంభమైన సోనూ ప్రస్ధానం దిగ్విజయంగా కొనసాగింది. అవసరార్ధం.. ఏ ట్వీట్ ఎవరు చేసినా నేనున్నాను అంటూ వారికి కాదనకుండా ఇచ్చాడు.. ఇస్తున్నాడు.. వారి కటుంబాల్లో వెలుగులు నింపుతున్నాడు. దీంతో దేశంలో సోనుసూద్ కు ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా సోను సేవలకు గుర్తింపు దక్కింది.
సోనూసూద్ చేసిన సేవను ఐక్యరాజ్య సమితి గుర్తించింది. తన అనుబంధ సంస్థ.. యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యుఎన్‌డిపి) ‘స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్’ అనే అవార్డుతో సత్కరించింది. దీంతో సోను అరుదైన పురస్కారం అందుకుని తగిన గౌరవం పొందారు. దీంతో సోనుసూద్ కు అన్ని వర్గాల నుంచి, ప్రజల నుంచి అభినందనలు వస్తున్నాయి. ఈ పురస్కారం అందుకున్న ప్రముఖ వ్యక్తుల సరసన చేరాడు సోనుసూద్.
ఐరాస నుంచి ఈ అవార్డు అందుకున్న వారిలో హాలీవుడ్ నటులు.. ఏంజెలినా జోలీ, లియనార్డో డికాప్రియో, డేవిడ్ బెక్ హామ్, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఉన్నారు. సోనూసూద్ రీసెంట్ గా ‘అల్లుడు అదుర్స్’ చిత్ర షూటింగ్ లో పాల్గొన్నాడు. చిత్ర యూనిట్ సోనూసూద్ సేవలకు గానూ సన్మానించింది