సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ కు బదిలీ అయ్యారు. దాదాపు ఏడాదిన్నరగా విశ్వప్రయత్నాలు చేసిన ఆమె.. తాజాగా అనుకున్నది సాధించారు. ఓబుళాపురం మైనింగ్ అక్రమాల కేసుతోపాటు వైసీపీ అధినేత జగన్ కేసుల్లో జైలుపాలైన శ్రీలక్ష్మి.. చివరకు బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ సర్వీసులో జాయిన్ అయ్యారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత ఆమెను తెలంగాణ కేడర్ కు కేటాయించారు.
అప్పుడు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఉండటంతో ఆమె అక్కడకు వెళ్లడానికి ఆసక్తి చూపించలేదు. అనంతరం జగన్ సీఎం కావడంతో ఏపీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జగన్ కలిసి తన అభీష్టాన్ని వెల్లడించగా.. అందుకు ఆయన కూడా సుముఖత వ్యక్తంచేశారు. తర్వాత ఆమెను ఏపీకి డిప్యుటేషన్ పై ఏపీకి పంపాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ను కోరగా.. అందుకు ఆయన కూడా అంగీకరించారు.
కానీ కేంద్రం నో చెప్పడంతో ఆ ఫైలు పెండింగ్ లో ఉండిపోయింది. జగన్ కేంద్రంతో సంప్రదింపులు చేసినా ఫలితం లభించలేదు. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మి క్యాట్ కు వెళ్లి ఏపీకి వెళ్లడానికి అనుమతి తెచ్చుకున్నారు. దీంతో శుక్రవారం ఆమె ఏపీ జీఏడీలో రిపోర్ట్ చేశారు. ఆమెకు సీఎంఓలో కీలక పోస్టు లభించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.