సుజనా చౌదరి కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు.. ప్రముఖ వ్యాపారవేత్త కూడా. ఆయన తన వ్యాపార కార్యకలాపాల్ని ఓ ప్రముఖ హోటల్ నుంచి నిర్వహిస్తున్నారట. ఈ క్రమంలో తాను పలువుర్ని కలుస్తుంటాననీ, తనను కలిసేందుకు పలువురు వస్తుంటారనీ, వారిలో కామినేని శ్రీనివాస్ వుండొచ్చు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ వుండొచ్చని చెబుతున్న సుజనా చౌదరి, ‘అది రహస్య భేటీ కానే కాదు’ అని తేల్చేశారు.
మరోపక్క, బీజేపీ అధిష్టానం ఈ వ్యవహారంపై సీరియస్‌గా వుందనీ, ‘రాజకీయంగా పోరాడాలే తప్ప, సీక్రెట్ కుట్రలకు పాల్పడకూడదని’ సూచించిందనీ.. వైసీపీ అనుకూల మీడియాలో ‘బ్రేకింగ్ న్యూస్‌లు’ బద్దలైపోయాయి.
సుజనా చౌదరి సంగతి పక్కన పెడితే, కామినేని శ్రీనివాస్.. భారతీయ జనతా పార్టీకి సంబంధించి నిఖార్సయిన నాయకుడు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. పార్టీ అధిష్టానంతో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ లెక్కన, సుజనా – కామినేని – నిమ్మగడ్డ భేటీ.. అధిష్టానానికి తెలియకుండా జరిగిందని ఎలా అనుకోగలం.?
నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కి సంబంధించి హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ కేసులు నడుస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తనను తొలగించడంపై నిమ్మగడ్డ హైకోర్టుని ఆశ్రయిస్తే, ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దాన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇదే కేసులో కామినేని కూడా నిమ్మగడ్డ తరఫున ‘ప్రొసీడ్’ అవుతున్నారు. అదంతా, అధిష్టానం కనుసన్నల్లోనే జరుగుతోందన్నది నిర్వివాదాంశం.
సో, తెరవెనుక ఏదో జరుగుతోంది. ఆ వ్యవహారాన్ని కూపీ లాగడానికి వైసీపీ ప్రయత్నించడం సహజమే. కానీ, తొందరపడి ఈ భేటీ తాలూకు వీడియోపై వైసీపీ రాద్ధాంతం చేస్తోందన్న చర్చ జరుగుతోంది. ‘అతి త్వరలో మరిన్ని వివరాలు..’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీటేసినా, ‘ముగ్గురు దొంగలు’ అని ఆయన అత్యుత్సాహం ప్రదర్శించినా.. వాటి వల్ల ‘ఆ ముగ్గురికి’ వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. పైగా, ఈ వ్యవహారంతో వైసీపీకి ఇసుమంతైనా ‘రాజకీయ లబ్ది’ లేదన్నది నిర్వివాదాంశం.
ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ, ‘నిమ్మగడ్డను కలిసినవారిద్దరూ బీజేపీ నేతలే.. మాపై విమర్శలు చేస్తున్న వైసీపీకి, బీజేపీ అధిష్టానంపై విమర్శలు చేసే ధైర్యముందా.?’ అని ప్రశ్నిస్తోంది. పైగా, ‘ఆ ముగ్గురూ కలిస్తే వైసీపీకి ఎందుకంత భయం.? అయినా, ఆ ముగ్గురి కలయికలో తప్పేంటి.?’ అని టీడీపీ నేత వర్ల రామయ్య కాస్త ఘాటుగానే స్పందించారు. ఇదిలా వుంటే, తాజా రాజకీయ పరిణామాల్ని జనసేన పార్టి జాగ్రత్తగా గమనిస్తోంది. ‘ఈ విషయమై బీజేపీ నుంచి సరైన స్పందన వచ్చాకే మేం స్పందిస్తాం..’ అంటున్నారు జనసేన నేతలు.