‘మీ చేతిలో అధికారం వుందని.. మీ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు.. నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, అప్పుడు మీ పరిస్థితేంటో ఒక్కసారి ఆలోచించుకోండి..’ అంటూ బీజేపీ సీనియర్ నేత సునీల్ దేవధర్ సంచలన రీతిలో ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశారు.
తిరుపతిలో ‘వకీల్ సాబ్’ సినిమాని బెనిఫిట్ షోలో చూసేందుకు సునీల్ దేవధర్, బీజేపీ శ్రేణులతో కలిసి ప్రయత్నించగా, బెనిఫిట్ షోలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్ కౌంటర్ వద్దనుండే సునీల్ దేవధర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
‘వకీల్ సాబ్’ సినిమాని చూసే భయపడుతున్నారా.? భవిష్యత్తులో రియాల్టీ చూడబోతున్నారంటూ సునీల్ దేవధర్, జగన్‌పై విరుచుకుపడ్డారు. ‘వకీల్ సాబ్’ సినిమాకి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. సినిమాలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ గెటప్‌లో కనిపించనుండడమే అధికార పార్టీ భయానికి కారణమన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
‘వకీల్ వచ్చాడు.. ఖైదీ భయపడ్డాడు’ (#VakeelEntersKhaidhiFears) అనే హ్యాష్‌ట్యాగ్‌ని పవన్ అభిమానులు ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. కుప్పలు తెప్పలుగా ఈ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు పడుతున్నాయి సోషల్ మీడియాలో. పండగ సమయాల్లో ఆర్టీసీ ఛార్జీల్ని అదనంగా వసూలు చేసే ప్రభుత్వం.. పవన్ కళ్యాణ్ సినిమా టిక్కెట్ల విషయంలో ఇంత నీఛానికి దిగజారడమేంటి.? అని ప్రశ్నిస్తున్నారు అభిమానులు.
పెట్రో ధరల్ని పెంచేసి సామాన్యుడి నడ్డి విరిచేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం, సాధారణంగా సినిమాల విడుదల సమయంలో పెరిగే టిక్కెట్ల విషయమై కుట్ర పూరితంగా వ్యవహరించడమేంటన్నది పవన్ అభిమానుల ప్రశ్న. సినీ అభిమానుల డిమాండ్ సంగతి పక్కన పెడితే, తిరుపతి ఉప ఎన్నిక వేళ ఇదొక పొలిటికల్ డిమాండ్ అయిపోయింది. పైగా, బీజేపీ నేతలు పవన్ తరఫున వకాల్తా పుచ్చుకోవడంతో వైసీపీ శ్రేణుల్లో వణుకు బయల్దేరింది. రివెంజ్ పాలిటిక్స్‌కి బీజేపీ తెరలేపితే వైఎస్ జగన్ పరిస్థితి ఏమవుతుందో మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించాలంటూ పవన్ అభిమానులు కోరుతుండడం గమనార్హం.