సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం అనంతరం బాలీవుడ్ రాజకీయాలు ఒక్కొక్కటే బైటకొస్తున్నాయి. ఇన్నాళ్లు ఇన్ సైడ్ సర్కిళ్లకు మాత్రమే పరిమితమైన ఈ వ్యవహారాలు.. ఇప్పుడు ప్రజల ముందుకొచ్చేశాయి. అయితే అన్ని వేళ్లూ సల్మాన్ ఖాన్ వైపు చూపించడమే ఇక్కడ విచిత్రమైన అంశం.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పై పలు కేసులున్నా.. ఆయన మనసు మంచిదని, దానధర్మాలు చేస్తుంటారని, అవకాశాలు లేని హీరోయిన్లకు లిఫ్ట్ ఇస్తుంటారని, బీయింగ్ హ్యూమన్ పేరుతో ఛారిటీ సంస్థ నడుపుతున్నారని పేరుంది. ఇదంతా బైటకు కనిపించేది, లోపల వ్యవహారం వేరే ఉందట.
దబంగ్ దర్శకుడు అభినవ్ కశ్యప్ చేసిన ఆరోపణలతో ఇవన్నీ మొదటసారిగా బైటకొచ్చాయి. దబంగ్ తర్వాత సల్మాన్ తన టాలెంట్ తొక్కేయాలని చూశారని, ఆయన తండ్రి, సోదరులు కూడా తనపై కక్షకట్టి సినిమాలు రాకుండా చేశారని ఆరోపించాడు అభినవ్.
మరోవైపు సుశాంత్ ను 7 సినిమాల నుంచి తీసేశారంటూ… సల్మాన్ సహా కరణ్ జోహార్ మరికొంత మందిపై బీహార్ లో ఓ లాయర్ కేసు పెట్టారు.
తాజాగా జియా ఖాన్ తల్లి కూడా సల్మాన్ ని టార్గెట్ చేసింది. చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన జియా ఖాన్ మరణం తర్వాత ఆ కేసు నుంచి సూరజ్ పంచోలిని బైటపడేసేందుకు సల్మాన్ ప్రయత్నించారని, అతనితో తాను సినిమా కాంట్రాక్ట్ లు కుదుర్చుకోవడం వల్ల సూరజ్ ని ఇబ్బంది పెట్టొద్దని తనపై సల్మాన్ ఒత్తిడి తెచ్చారని జియా తల్లి రబియా అమిన్ ఆరోపించారు.
మరోవైపు బాలీవుడ్ లో బంధుప్రీతిపై కూడా తీవ్ర చర్చ నడుస్తోంది. చాలామంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు తాము కూడా దారుణంగా అవమానాలు పొందామని, అయినా తట్టుకుని నిలబడ్డామని చెబుతూ వస్తున్నారు. వ్యక్తిగత కష్టాలు వెళ్లడిస్తున్న వారెవరూ దానికి కారణమైన వారి పేర్లు చెప్పడంలేదు కానీ.. సల్మాన్ ఖాన్ మాత్రం దారుణంగా టార్గెట్ అయ్యాడు.
అభినవ్ కశ్యప్, జియా ఖాన్ తల్లి.. మరికొందరు చేసిన ఆరోపణల వల్ల సల్మాన్ దోషిగా నిలబడ్డాడు. ఈ ఆరోపణలపై ఇప్పటి వరకూ సల్మాన్ స్పందించలేదు కానీ, నిప్పులేనిదే పొగరాదని, సల్మాన్ తప్పులేనిదే ఇలాంటి ఆరోపణలు ఎందుకు బైటకొస్తాయని బాలీవుడ్ వర్గాలంటున్నాయి.