లాక్‌డౌన్ కారణంగా అన్ని రంగాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. ప్రత్యేకంగా చిత్ర పరిశ్రమ కష్టాల గురించి చెప్పాల్సి వస్తే…సినిమా కష్టాలే. కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు లాక్‌డౌన్ విధించారు. దీంతో ఇళ్లకు పరిమితమై సెల్‌ఫోన్‌కు అతుక్కుపోవడం తప్ప మరే మార్గం కనిపించడం లేదు.
ఇంట్లో బోర్ కొట్టకుండా మహిళలైతే సీరియళ్లు, యువత విషయానికి వస్తే వెబ్ సిరీస్, ముఖ్యంగా సినిమాలు.. ఇలా అన్నింటినీ కూర్చున్నదగ్గరే చూస్తూ జాలీగా గడిపేస్తున్నారు. వీటన్నింటికి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వేదికగా నిలుస్తున్నాయి. కొత్త సరుకు, కొంగొత్త ఆలోచనలతో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, వూట్ వంటి ఎన్నో యాప్స్ ప్రేక్షకులకు వినోదాన్ని, ఆనందాన్ని అందిస్తున్నాయి.
అంతేకాదు ఆర్థికంగా కూడా కలిసొస్తోంది. ఒక్క సినిమా టికెట్ కొనే రేటుకే ఎన్నో సినిమాలను చూసే అవకాశం లభిస్తోంది. ఈ నేపథ్యంలో జనం ఈ ఓటీటీ యాప్స్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా అనంతర పరిస్థితులు, ఓటీటీపై నటి టిస్కా చోప్రా ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ప్రస్తుతం మంచిరోజులు నడుస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ ముగిసాక కూడా ప్రజలు అంత సులువుగా థియేటర్‌కు రాలేరేమోనని ఆమె బాంబు పేల్చారు. ఇంకా ఆమె చెప్పిన విషయాలు వింటే చిత్రరంగంలోని వారికి గుండె ఆగినంత పని అవుతుంది. కానీ చేదు నిజాలు అలాగే ఉంటాయి మరి. కాస్తా గుండె నిబ్బరం చేసుకుని నటి టిస్కా చోప్రా మాటలు విని….ధైర్యం కూడగట్టుకోవాల్సిన తరుణం ఇది.
‘ఇప్పటికే చాలా సరుకంతా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు వెళుతున్నాయి. రానున్న కాలంలో చిన్న, మధ్య తరహా సినిమాలు కూడా వీటినే ఎంచుకుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో 500 మందితో కలిసి తలుపులు మూసిన థియేటర్‌లో నేను కూడా ఉండాలనుకోను. ఎందుకంటే అప్పుడు వైరస్ వ్యాప్తి చెందడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. పైగా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇంకా వ్యాక్సిన్ కనుగోనందున ఎవరూ థియేటర్‌కు రావడానికి ఇష్టపడరు. సుమారు ఓ ఏడాదిపాటు జనాల్లో ఇదే అభిప్రాయం కొనసాగవచ్చు. దీంతో పెద్ద సినిమాలు మరో ఆరునెలలు, లేదా ఓ సంవత్సరం వరకు ఆలస్యంగా విడుదలయ్యే అవకాశం ఉంది’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం అనేక వెబ్ సిరీస్‌లలో నటిస్తున్న టిస్కా చోప్రా చెప్పిన విషయాలు చాలా విలువైనవి. ఎందుకంటే ఈ అభిప్రాయంలోనే చాలా మంది సినీ పెద్దలున్నప్పటికీ ధైర్యం చేసి చెప్పేందుకు ముందుకు రాలేదు. కానీ టిస్కా చోప్రా ఒక అడుగు ముందుకేసి కఠోర వాస్తవాన్ని చెప్పడం ద్వారా అందుకు తగ్గట్టుగా చిత్ర పరిశ్రమ సమాయత్తం కావడానికి ఆస్కారం ఉంటుంది. మభ్య పెట్టే, మాయ చేసే వాళ్ల మాటల కంటే…నిష్టూరమైనా టిస్కా చోప్రానే మంచి పని చేశారు.