కరోనా వైరస్ కారణంగా సినీ పరిశ్రమలో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో మన తారలందరూ ముందుకొచ్చి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు ప్రభుత్వానికి విరాళాలు ప్రకటిస్తుూనే.. మరోవైపు పరిశ్రమలోని కార్మికుల కోసం ఏర్పాటైన కరోనా క్రైసిస్ చారిటీకి కూడా ఆర్థిక సాయం అందిస్తున్నారు. చిరంజీవి మొదటగా అడుగు వేస్తే.. ఆ తర్వాత అందరూ ఆయన్ని అనుసరిస్తున్నారు. నాగార్జున, వెంకటేష్ లాంటి వాళ్లు కొంచెం ఆలస్యంగా ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
ఐతే నందమూరి బాలకృష్ణ, విజయ్ దేవరకొండ మాత్రం ఎంతకీ స్పందించకపోయేసరికి.. సోషల్ మీడియాలో వాళ్ల మీద ట్రోలింగ్ మొదలైంది. చివరికి బాలయ్య కూడా బయటికొచ్చాడు. కోటి 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించాడు. ఇక పేరున్న హీరోల్లో మిగిలింది విజయ్ దేవరకొండే. కానీ అతను అడ్రస్ లేకుండా పోయాడు.
ఈ సంక్షోభ సమయంలో విరాళాల సంగతలా ఉన్నా.. కనీసం జనాల్లో అవగాహన పెంచే ప్రయత్నం కూడా విజయ్ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే ఎట్టకేలకు విజయ్ బయటికి వచ్చాడు. అప్పుడెప్పుడో హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో అగ్ర స్థానంలో నిలిచినపుడు ట్విట్టర్లో సందడి చేసిన విజయ్.. ఆ తర్వాత మళ్లీ మంగళవారమే ట్వీట్ వేశాడు. ఈ ట్వీట్ కరోనా గురించే. మెడికల్ మాస్కుల్ని సామాన్యులు ఉపయోగించకుండా వాటిని డాక్టర్లకు విడిచిపెట్టాలని.. బదులుగా హ్యాండ్ కర్చీఫ్ లేదంటే స్కార్ఫ్ లేదంటే అమ్మ చున్నీని ముఖానికి కట్టుకుని కరోనా నుంచి రక్షణ పొందవచ్చని.. అందరూ ముఖాన్ని కవర్ చేసుకుని సురక్షితంగా ఉండాలని పిలపునిచ్చాడు విజయ్.
తను కర్చీఫ్ లాంటిదే ముఖానికి కట్టుకుని ఫొటోకు పోజిచ్చాడు విజయ్. ఈ ఫొటోలో కండలు తిరిగిన బాడీతో ఆకర్షణీయంగా కనిపించడంతో అతడి అభిమానులు వావ్ అంటున్నారు. ఐతే కేవలం మెసేజ్ ఇచ్చి వెళ్లిపోయిన విజయ్.. విరాళం సంగతేమీ తేల్చలేదేంటని కొందరు విమర్శలు అందుకున్నారు. ఐతే విజయ్ ప్రచారానికి దూరంగా ఏమైనా చేస్తుండొచ్చన్న అభిప్రాయాన్ని ఇంకొందరు వ్యక్తం చేశారు.