కరోనా తగ్గుముఖం పట్టకున్నా కూడా ఇప్పటికే సీరియల్స్ మరియు వెబ్ సిరీస్ ల షూటింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఇదే సమయంలో సినిమాల షూటింగ్స్ కూడా మెల్లగా ప్రారంభం అవుతున్నాయి. ఈ నెలలో కొన్ని ప్రారంభం అవ్వగా వచ్చే నెల ఆ తర్వాత నెలల్లో ఎక్కువగా షూటింగ్ జరిగే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలో విజయ్ దేవరకొండ మూవీ కూడా పట్టాలెక్కే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఆగస్టు చివరి వారం నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ ను తక్కువ మంది టీంతో నిర్వహించాలని నిర్ణయించారు.
తీరా షూటింగ్ కు వెళ్లాలనుకున్న సమయంలో కరోనా కేసులు ఇంకా పెరుతున్న నేపథ్యంలో మరికొన్నాళ్లు ఆగితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారట. లాక్ డౌన్ కు ముందు వరకు ఈ సినిమాను ముంబయిలో చిత్రీకరించారు. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో ముంబయి సెట్టింగ్ వేసి చిత్రీకరణ చేయాలనుకున్నారు. కాని విజయ్ దేవరకొండతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఇతరులు ఆందోళన వ్యక్తం చేశారట. ఆ కారణంగా షూటింగ్ ను మళ్లీ వాయిదా వేశారంటూ సమాచారం అందుతోంది.
కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత షూటింగ్ కు వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండేను ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటికే ఆమె కొన్ని రోజుల షూటింగ్ లో కూడా పాల్గొంది. ఫైటింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అందుకే ఫైటర్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా ప్రచారం జరిగింది. టైటిల్ విషయంలో యూనిట్ సభ్యుల నుండి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.