టాలీవుడ్ లో విభిన్నమైన కథలతో .. విజయాలతో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్లలో శివ నిర్వాణ ఒకరు. అనిల్ రావిపూడి తరువాత తన మార్కు చూపిస్తున్న దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ‘నిన్ను కోరి’ సినిమాతో ఒక కొత్త ప్రేమకథను ఆయన ప్రేక్షకులకు పరిచయం చేశాడు. తనని ప్రేమించిన హీరోకి .. తనకి పెళ్లి అయిన తరువాత హీరోయిన్ ఆశ్రయం ఇవ్వడం కొత్త పాయింట్. ఈ సినిమా భారీ విజయంతో పాటు ఆయనకి అభినందనలు తెచ్చిపెట్టింది. ఆ తరువాత సినిమాగా ఆయన చైతూతో ‘మజిలీ’ సినిమా చేశాడు.
ఈ సినిమాలోనూ ఆయన ప్రేమ – పెళ్లి అనే రెండు ఎమోషన్స్ ను కలుపుతూ అల్లిన కథ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. కథలోని ఈ రెండు అంశాల కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా విపరీతంగా థియేటర్లకు రప్పించింది. అలా ఆ సినిమాతో సక్సెస్ ను అందుకున్న ఆయన ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే చేసిన సినిమా ‘టక్ జగదీష్. టైటిల్ తోనే అందరిలో ఆసక్తిని రేకెత్తించిన ఆయన ఇటీవలే ఈ సినిమాను థియేటర్లకు తీసుకొచ్చాడు. కథ పాతదే అనే టాక్ వినిపించింది. అయితే ఆ విషయాన్ని నానితో ఆయన ముందుగానే చెప్పించాడు కాబట్టి సమస్య లేదు.
ఇక విజయ్ దేవరకొండతో తాను ఒక సినిమా చేయనున్నట్టు ఆయన కొంతకాలం క్రితమే చెప్పాడు. కథ విజయ్ దేవరకొండకి నచ్చిందని కూడా అన్నాడు. నాని సినిమా తరువాత ఆ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ తరువాత ఎక్కడా కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలేదు. వాయిదా పడిందనే టాక్ కూడా వినిపించడం లేదు. రీసెంట్ గా తాను మరో ప్రేమకథను రెడీ చేసుకుంటున్నట్టుగా శివ నిర్వాణ చెప్పడం .. NN4 అనే హ్యాష్ ట్యాగ్ ఇవ్వడం వలన విజయ్ దేవరకొండతో సినిమా లేనట్టేననే విషయంలో కొంచెం కొంచెంగా క్లారిటీ వస్తోంది.
శివ నిర్వాణ వైజాగ్ బీచ్ లో .. ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని తన తదుపరి సినిమా కోసం కథను రెడీ చేసుకుంటున్నాడు. తాను ఒక ప్రేమకథను రాసుకుంటున్నానీ .. సముద్రంలోకి కెరటాల మాదిరిగా ఆ ప్రేమకథ చాలా స్వచ్ఛంగా ఉంటుందని వీడియో చేస్తూ మరీ చెప్పాడు. దాంతో ఆయన విజయ్ దేవరకొండ కోసం రెడీ చేసుకున్న కథ పక్కన పెట్టేసినట్టేనని అనుకోవాలి. పాన్ ఇండియా కథలపైనే విజయ్ దేవరకొండ దృష్టి పెడుతూ ఉండటమే ఈ సినిమా కథ కార్యరూపాన్ని ధరించకపోవడానికి కారణమని చెప్పుకుంటున్నారు. ఇక శివ నిర్వాణ రెడీ చేస్తున్న ప్రేమకథలో నాయకుడు నాగచైతన్యనే అనే టాక్ మాత్రం బలంగానే వినిపిస్తోంది.