వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటారన్న విషయం అందరికీ తెల్సిందే. అధినేత వైఎస్ జగన్ భజన సంగతెలా వున్నా, సోషల్ మీడియాని కేవలం చంద్రబాబుపై విమర్శలు చేయడానికే ఎక్కువగా వాడుతుంటారు విజయసాయిరెడ్డి. పనిలో పనిగా బీజేపీకి ఉచిత సలహాలు ఇవ్వడం కూడా ట్విట్టర్ ద్వారా విజయసాయిరెడ్డి చేస్తుంటారనుకోండి.. అది వేరే సంగతి.
ఒక్కోసారి అలాంటి ‘ఉచిత సలహాలు’ బెడిసికొట్టిన సందర్భాలూ లేకపోలేదు. ఇక, విసారె తాజా ట్వీట్ విషయానికొస్తే, ‘తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందనే సామెత చంద్రబాబుకి చక్కగా సరిపోతుంది..’ అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైసీపీకే గట్టిగా తగులుతున్నాయి. ‘అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, న్యాయస్థానం నుంచి బెయిల్ పొంది బయట తిరుగుతున్నారు.. అధికారం వచ్చింది కదా.. ఆ న్యాయవ్యవస్థ మీద కసి తీర్చుకుంటున్నారు.. న్యాయమూర్తులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. ఇది కదా తాచెడ్డ కోతి వనమెల్ల చిరిచిందనే సామతకు అసలు సిసలు ఉదాహరణ’ అంటూ కొందరు నెటిజన్లు (వైసీపీని వ్యతిరేకించేవాళ్ళు) ఎడా పెడా కామెంట్లు చేసేస్తున్నారు.
అదంతే, విజయసాయిరెడ్డి ఎప్పుడు ఎవరి మీద ట్వీటేసినా.. అది వైసీపీకి తిరిగి గట్టిగానే కొట్టేస్తుంటుంది. ఈసారి ఇంకాస్త గట్టిగా కొట్టేస్తోందంతే. ఏదో చెయ్యాలనుకుంటారు.. ఏదో చెప్పేయాలనుకుంటారు.. ప్రతిసారీ బోల్తా కొట్టేస్తుంటారు విజయసాయిరెడ్డి ట్వీట్స్ విషయంలో. ‘అయినా ఆయన భ్రమల్లోంచి బయటకు రాడు.. అందరినీ భ్రష్టుపట్టించేవరకూ వదలడు..’ అంటూ విజయసాయి ట్వీట్‌లో ముగింపుని వైఎస్ జగన్‌కి వ్యతిరేకంగా.. అడ్డగోలుగా వాడేస్తున్నారు నెటిజన్లు.
బహుశా అందరూ అలా అనుకోవాలనే విజయసాయిరెడ్డి అలా ట్వీటేశారా.? అన్నది టీడీపీ మద్దతుదారుల డౌటు. ఇంతకీ, విజయసాయిరెడ్డి ఈ ట్వీట్ నిజంగానే చంద్రబాబుని ఉద్దేశించి వేశారా.? ఏమో, ఆయనకే తెలియాలి.
తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందనే సామెత చంద్రబాబుకి చక్కగా సరిపోతుంది. గెలుపోటములు నిర్ణయించేది ప్రజలు. వారి విశ్వాసాన్ని కోల్పేతే ఏ వ్యవస్థా తనను దొడ్డిదారిన అధికార పీఠంపై కూర్చోబెట్టలేదు. అయినా ఆయన భ్రమల్లోంచి బయటకు రాడు. అందరినీ భ్రష్టుపట్టించే వరకు వదలడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 20, 2020