ప్రపంచమంతా కరోనా దెబ్బకి విలవిల్లాడుతోంటే, ‘కరోనా రాజకీయాలతో’ టైంపాస్ చేస్తున్నారు వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈసారి ఆయన భారతీయ జనతా పార్టీని గట్టిగా కెలికేసి, చాలా చాలా గట్టిగానే గిల్లించుకుంటున్నారు కూడా.! ఇదేమి రాజకీయ పైత్యమోగానీ, విజయసాయిరెడ్డి విపరీత పోకడలు రాష్ట్ర ప్రజానీకానికి చిరాకు తెప్పిస్తున్నాయి. నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది ఆయన వ్యవహారశౖలి.
లేకపోతే, ‘వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, విశాఖను రాజధానిగా చేయాలనుకుంటున్నారు.. దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు’ అని ఇప్పుడు ఈ కరోనా సందర్భంలో విజయసాయిరెడ్డి చెప్పడమేంటి.? రాజధాని వ్యవహారాల గురించి మాట్లాడే సందర్భమా ఇది.? ఆ సంగతి పక్కన పెడితే, కన్నా లక్ష్మినారాయణతోపాటు తాజాగా బీజేపీ ముఖ్య నేతల్లో ఒకరైన పురంధరీశ్వరిని కూడా ఇప్పుడు వివాదంలోకి లాగారు విజయసాయిరెడ్డి. వీళ్ళిద్దరూ ఎన్నికల ఖర్చుల కోసం కేంద్రం ఇచ్చిన సొమ్ముల్ని నొక్కేశారనీ, అందుకు తగ్గ ఆధారాలు తన దగ్గర వున్నాయని చెబుతున్నారీ వైసీపీ ఎంపీ.
రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్సార్సీపీకి వుందా.? అన్న ప్రశ్న బీజేపీ నుంచి దూసుకొస్తోందంటే.. అదంతా విజయసాయి అత్యుత్సాహం కారణంగానే. అక్కడికేదో బీజేపీ అధిష్టానం, విజయసాయిరెడ్డి చేతుల మీదుగా కన్నా లక్ష్మినారాయణకీ, పురంధరీశ్వరికి ఎన్నికల ఫండ్ ఇప్పించినట్లుంది కదూ.! 20 కోట్లకు కన్నా అమ్ముడుపోయారనే తన ఆరోపణలకు కట్టుబడి వున్నానని విజయసాయిరెడ్డి అంటున్నారు.
మరి, ఇదే మాట మీద నిలబడి, కాణిపాకం వినాయకుడి గుడిలో ‘ప్రమాణం’ చేస్తావా జైలు పక్షీ.. అని కన్నా లక్ష్మినారాయణ ప్రశ్నిస్తే, ‘మీ అవినీతిపై నా దగ్గర ఆధారాలున్నాయి..’ అంటూ బుకాయిస్తున్నారు విజయసాయిరెడ్డి. ఇప్పటికే కరోనా దెబ్బకి రాష్ట్రంలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 700 మార్కు దాటేసి.. 1000 ఫిగర్ దిశగా దూసుకుపోతోంది. ఈ పరిస్థితుల్లో రాజకీయాలు చేయడమంటే, శవాల దగ్గర పేలాలు ఏరుకోవడం కాక మరేమిటి.? ఈ నీఛ నికృష్ట రాజకీయాలే కదా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నది.?